ట్రబుల్ షూటర్ టు సీఎం
కర్ణాటకలో డీకే శివకుమార్ యుగం ప్రారంభం
నాలుగు దశాబ్దాల నిరీక్షణ, పట్టుదలకు అందలం
ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన డీకేఎస్
సిద్దరామయ్య నుంచి విజయవంతంగా బదిలీ అయిన అధికారం
సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న ‘ట్రబుల్‌షూటర్’
తీహార్ జైలు నుంచి టాప్ పొజిషన్ వరకు సాగిన ప్రస్థానం
డీకే శివకుమార్ రాజకీయ, పరిపాలన సవాళ్లు
మౌలిక సదుపాయాల కొరత ఉచిత హామీల ఆర్థిక భారం
కేబినేట్‌లో సమతుల్యత సాధించడం కత్తిమీద సామే
మేకేదాటు ప్రాజెక్టు, కావేరి జల వివాదం..
పొరుగు రాష్ట్రాలతో పొలిటికల్, లీగల్ ఫైట్‌కు సిద్ధం కాక తప్పని పరిస్థితి
కాకతీయ, నేషనల్ డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన వ్యూహకర్తగా, సంక్షోభ సమయాల్లో పార్టీని ఆదుకునే ‘ట్రబుల్‌షూటర్’గా పేరొందిన డొడ్డ ఆలహళ్లి కెంపేగౌడ శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైకమాండ్ ఫార్ములా ప్రకారం.. మాజీ సీఎం సిద్దరామయ్య నుంచి అధికార మార్పిడి సజావుగా సాగడంతో, డీకేఎస్ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. అయితే, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వెయ్యి కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక నేతగా నిలిచిన డీకే శివకుమార్ ప్రయాణం పూలపాన్పేమీ కాదు. నిర్బంధాలు, ఈడీ అరెస్టులు, తీహార్ జైలు జీవితం.. వీటన్నింటినీ తట్టుకుని ‘ఉక్కు మనిషి’లా నిలబడిన ఆయనకు ఇప్పుడు అసలైన పరిపాలనా పరీక్ష మొదలైంది.
కింగ్‌మేకర్ టు కింగ్ .. జైలు ప్రతిజ్ఞ నెరవేరిన వేళ
1985లో తొలి ఎన్నికల ఓటమితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన డీకేఎస్, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాతనూరు, కనకపుర నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు కంచుకోటలుగా మార్చారు. 2002లో మహారాష్ట్ర సంక్షోభం, 2017లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్టులలో కాపాడి జాతీయ స్థాయిలో రియల్ ట్రబుల్‌షూటర్‌గా ఎదిగారు. 2019లో మనీలాండరింగ్ ఆరోపణలపై 50 రోజులకు పైగా తీహార్ జైలులో గడిపిన సమయంలో.. తాను సీఎం అయ్యే వరకు గడ్డం తీయనంటూ ఆయన చేసిన ప్రతిజ్ఞ నేడు నెరవేరింది. 2023 ఎన్నికల్లో పార్టీని గెలిపించినా.. అధిష్ఠానం మాట కోసం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి పొలిటికల్ మెచ్యూరిటీ చాటుకున్న శివకుమార్‌కు, ఇప్పుడు పూర్తి స్థాయి అధికారం దక్కింది. తొలిరోజే విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు, నిరుద్యోగులకు ఉపాధి పథకాలతో డీకేఎస్ తన మార్క్ పాలనను స్పీడప్ చేశారు.
గ్యారెంటీల భారం.. అంతర్గత సమతుల్యత
ముఖ్యమంత్రి కుర్చీ దక్కిన ఆనందం ఒకవైపు ఉన్నా.. డీకే శివకుమార్ ముందు ఐదు ప్రధాన సవాళ్లు పర్వతంలా నిలిచి ఉన్నాయి. మొదటిది, పార్టీలో సిద్దరామయ్య వర్గాన్ని, తన వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ సామాజిక సమీకరణాల మధ్య క్యాబినెట్‌ను నడపడం. రెండోది, కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీల వల్ల రాష్ట్ర బడ్జెట్‌పై పడుతున్న అపారమైన ఆర్థిక భారాన్ని మోస్తూనే.. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం. ముఖ్యంగా ఐటీ హబ్ బెంగళూరులో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి టన్నెల్ రోడ్ల వంటి భారీ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ డీకేఎస్‌కు పెద్ద టాస్క్ కానుంది.
అంతరాష్ట్ర వివాదాలు.. 2028 టార్గెట్
రాజకీయ సవాళ్లతో పాటు భౌగోళిక, న్యాయపరమైన సమస్యలు డీకే శివకుమార్‌ను చుట్టుముట్టనున్నాయి. కర్ణాటక-తమిళనాడు మధ్య అత్యంత సున్నితమైన కావేరి జల వివాదం, మేకేదాటు ప్రాజెక్టు నిర్మాణంపై పొరుగు రాష్ట్రంతో పొలిటికల్ అండ్ లీగల్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. నీటి పారుదల శాఖను నిర్వహించిన అనుభవం ఇందుకు పనికొచ్చినా, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను సమతూకం చేయడం అంత తేలిక కాదు. వీటన్నింటినీ అధిగమిస్తూ, ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకుంటూ.. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేర్చడమే ఈ ‘ట్రబుల్‌షూటర్’ ముందున్న అసలైన ‘పొలిటికల్ ఎగ్జామ్’. ఇప్పటివరకు పార్టీ సమస్యలను తీర్చిన డీకే శివకుమార్.. ఇప్పుడు రాష్ట్ర సమస్యలను ఎలా తీరుస్తారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘డీకేఎస్ యుగం’ కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపిస్తుందా లేక సవాళ్ల సుడిగుండంలో చిక్కుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

