ఖమ్మంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ
చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి మురుగునీరు
చర్చి కాంపౌండ్ బ్రిడ్జి మరమ్మతుల్లో జాప్యంతో తిప్పలు
వర్షాకాలం ముంచుకొస్తున్నా కాగితాలకే పరిమితమైన ముందస్తు చర్యలు
పారిశుద్ధ్య లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఖమ్మం నగరవాసులు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోంది. వర్షాకాలం సమీపిస్తున్న వేళ అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడో పట్టణ పరిధిలోని పీఎస్ఆర్ రోడ్డు, హర్కరబావి చౌరస్తా, మామిళ్లగూడెం, సారధి నగర్, మయూరి సెంటర్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైకి రావడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

బ్రిడ్జి మరమ్మతుల్లో జాప్యం
చర్చి కాంపౌండ్ బ్రిడ్జిపై చేపట్టిన మరమ్మతు పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం మరో సమస్యగా మారిందని నగరవాసులు తెలిపారు. గత మూడు నెలలుగా పనులు నత్తనడకన సాగుతుండటంతో కురిసిన వర్షపు నీరు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతంలోకి చేరి వాహనదారులకు చుక్కలు చూపించింది. రహదారిపై ఏర్పడిన ఇబ్బందులతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరమ్మతు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటికే అధికారులను మందలించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అలసత్వం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పారిశుద్ధ్య వ్యవస్థను పర్యవేక్షించాల్సిన అధికారులు, ముఖ్యంగా అసిస్టెంట్ కమిషనర్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు డ్రైనేజీల శుభ్రత, మురుగునీటి ప్రవాహాల నియంత్రణ, చర్చి కాంపౌండ్ బ్రిడ్జి మరమ్మతుల పూర్తి వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. చిన్న వర్షానికే ఖమ్మం నగరం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

