మద్దతు ధరల జీవో మార్చాల్సిందే
లేదంటే కేంద్రాన్ని రాజకీయంగా పాతరేస్తాం
నామమాత్రపు పెంపుతో అన్నదాతల కన్నీళ్లు
సాగు పెట్టుబడులు ఆకాశాన్ని తాకినా కనికరం లేదు
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కిన ప్రభుత్వం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు
కాకతీయ, కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను నామమాత్రంగా పెంచి రైతులను దగా చేస్తోందని, ఈ జీవోను సవరించి రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం మరోసారి రైతుల నడ్డి విరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, డీజిల్, కూలీల ధరలు భారీగా పెరిగిన వేళ, ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఏమాత్రం సరితూగవని, కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు.
గణాంకాలతో సహా నిరూపితమైన నష్టాలు
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సాగుకు అయ్యే ఖర్చుపై 50 శాతం అదనంగా ధర నిర్ణయించాల్సి ఉండగా, కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని సుదర్శన్ రావు వివరించారు. వరి పంట విషయానికి వస్తే, శాస్త్రీయ పద్ధతిలో క్వింటాలుకు 3,243 రూపాయలు ఉండాల్సిన ధరను కేంద్రం 2,441 రూపాయలకే పరిమితం చేసి, రైతుల జేబులకు 802 రూపాయల చొప్పున గండి కొట్టిందని ఆయన స్పష్టం చేశారు. మొక్కజొన్నలో క్వింటాలుకు 585.5 రూపాయలు, కందుల సాగులో ఏకంగా 2,545 రూపాయల చొప్పున రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆయన గణాంకాలను బయటపెట్టారు. కనీస మద్దతు ధర అనేది కేవలం కాగితాలకే పరిమితం అవుతోందని, మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చలనం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని సాగు ఉత్పత్తి వ్యయంలో ఒకటిన్నర రెట్లు ధరను నిర్ణయించాలని, చిన్న మరియు కౌలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అన్యాయమైన ధరల జీవోను సవరించే వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని, కార్పొరేట్ అనుకూల విధానాలను ఓడించేందుకు రైతాంగం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణతో పాటు పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

