ఇసుక ర్యాంప్‌లలో అక్రమ వసూళ్లు అరికట్టాలి
ఒక్కో లారీ నుంచి రూ. 2000 నుంచి రూ. 2500 వరకు వసూళ్లు
దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న ఇసుక కాంట్రాక్టర్లు
ఓవర్‌లోడ్‌కు సహకరిస్తూ ఫోన్లు ఎత్తకుండా సిబ్బంది సహకారం
టీజీఎండీసీ జీఎంకు లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతి
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇసుక ర్యాంప్‌లలో కాంట్రాక్టర్లు లోడింగ్ పేరుతో చేస్తున్న అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని పెద్ద అంబర్పేట్ ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) జీఎం ఎల్లయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలగోని భాస్కర్ గౌడ్, జనరల్ సెక్రటరీ రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇసుక ర్యాంప్‌లలో జిల్లాకో విధంగా కాంట్రాక్టర్లు లారీ ఓనర్ల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. లోడింగ్ మరియు ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో లారీ నుండి రూ. 2000 నుంచి రూ. 2500 వరకు గుంజుతున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల కొందరు ఎస్ఆర్ఏలు కూడా కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తూ ఓవర్‌లోడ్ లోడింగ్‌కు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ర్యాంప్‌ల వద్ద లోడింగ్ డబ్బుల విషయంలో ఇబ్బందులు ఎదురై డ్రైవర్లు గానీ, లారీ ఓనర్లు గానీ ఫోన్ చేస్తే ఎస్ఆర్ఏలు, పీఓ గారు అస్సలు లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యను పరిష్కరిస్తాం: జీఎం ఎల్లయ్య
ลారీ ఓనర్ల సమస్యలపై స్పందించిన జీఎం ఎల్లయ్య.. ఇసుక కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని ఎండీ గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇసుక రవాణాలో నిబంధనలు పాటించేలా అన్ని లారీలకు నంబర్ ప్లేట్లు, జీపీఎస్ పరికరాలను తప్పనిసరిగా అమర్చాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు బలరాం గౌడ్, నర్సింహా, ఐతగోని స్వామి, మునుకుంట్ల శ్రీను, శేఖర్, ప్రవీణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

