ఓడినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మహేష్
ఆపదలో ఉన్న వారికి కొనసాగుతున్న ఆర్థిక సాయం
గ్రామంలో ఎవరైనా మరణిస్తే రూ. 10,000.. ఆడపిల్ల పుడితే రూ. 5000 సాయం
కాకతీయ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన గాజుల మహేష్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తన మాట నిలబెట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం, ఆడపిల్ల జన్మిస్తే రూ. 5000 ప్రోత్సాహకంగా అందిస్తానని ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో గెలవకపోయినా, ప్రకటించిన హామీలను కొనసాగిస్తూ మహేష్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దాసారపు ఎల్లయ్య ఇటీవల మరణించగా.. మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఇది 3వ సారి అమలు చేసిన కార్యక్రమంగా గ్రామస్థులు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవహరించిన గాజుల మహేష్‌ను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

