పీఆర్పీ చికిత్సలపై జాగ్రత్త!
శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సలతో ప్రమాదం
సామాన్యుల ప్రాణాలతో కొంతమంది వైద్యుల చెలగాటం
మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్స పేరుతో అబద్ధపు ప్రచారాలు
ప్రముఖ మోకాళ్ల వైద్య చికిత్స నిపుణులు గురవా రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : వైద్యరంగంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న అశాస్త్రీయ ప్రచారాలపై ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ గురవా రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నో మోసాలు, దగాకోరు అబద్ధాలు ఒక నెపంతో సామాన్యులపై రుద్దబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్స పేరుతో సాగుతున్న ‘పీఆర్పీ’ ఇంజక్షన్ల దందా అబద్ధపు ప్రచారమని, దీనిని ఎండగట్టడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. సామాన్యుడిగా బయట తిరిగేటప్పుడు వినబడే వాస్తవాలు, అవాస్తవాలు ఎంతటి అయోమయాన్ని, ఆవేదనని, భయాన్ని నింపుతున్నాయో తాను అర్థం చేసుకోగలనని డాక్టర్ గురవా రెడ్డి తెలిపారు. శాస్త్రీయ రుజువు లేకుండా కొందరు ‘పీఆర్పీ’ అంటూ రోగుల మనసులో కలిగించే అనిశ్చితిని తాను గమనిస్తున్నానని చెప్పారు. దుర్మార్గంగా జరిగే అనైతిక ప్రచారాలను, పేషెంట్లను అమాయకులను చేస్తూ జరిగే ప్రలోభాలను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా, ఈ అబద్ధపు ప్రచారాలపై సమయం కేటాయించాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు.
నిజానిజాలను పరిచయం చేస్తూ దండయాత్ర
సమాజ హితం కోరే వైద్యుడిగా గత కొన్ని ఏళ్లుగా అబద్ధాలను బద్దలు కొడుతూ, నిజాన్ని చాటిచెప్పే దిశగా తన తరహా దండయాత్రను కొనసాగిస్తున్నానని డాక్టర్ గురవా రెడ్డి తెలిపారు. కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజలకు అవగాహన కల్పించానో, ఇప్పుడు కూడా మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్సపై అదే తరహా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శాస్త్రీయ ఆధారాలతో నిజాన్ని పరిచయం చేయడం ద్వారా అబద్ధాలు మరింత పాకకుండా అరికట్టవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోకాళ్ళ ఆర్థరైటిస్‌కు అవసరమైన వైద్యం ఏది, ఆపరేషన్ ఎప్పుడు అవసరమవుతుంది అనే అంశాలను వివరిస్తూ ‘పీఆర్పీ’ పేరుతో జరిగే అబద్ధపు ప్రచారాలను ఎండగడుతూ తాను ఒక ప్రత్యేక వీడియోను రూపొందించానని డాక్టర్ గురవా రెడ్డి పేర్కొన్నారు.

