నెమ్మదిగా రుతు పవనం
చురుకుదనలేమితో విస్తరణ ఆలస్యం
దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు.. ఉత్తర తెలంగాణలో ఎండలు
దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల వరకు మాత్రమే విస్తరణ
రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం
రుతుపవనాలు విస్తరించాకనే పంటలకు సిద్ధం కావాలి
ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో తొంభై శాతమే వర్షపాతం నమోదు
హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈనెల 8 వ తేదీనే ప్రవేశించినప్పటికీ వాటిలో చురుకుదనం లేకపోవడం వల్లే విస్తరణ ఆలస్యం అవుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటివరకు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల వరకు మాత్రమే రుతుపవనాలు విస్తరించాయని, రాగల రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కేరళలో ప్రవేశించిన తొలిరోజుల్లో కొద్దిగా నెమ్మదించి, అనంతరం పుంజుకున్నాయని చెప్పారు. అయితే ఈ విస్తరణలో ఆలస్యం వర్షపాతంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు
నైరుతి ప్రవేశించినా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని శ్రీనివాసరావు వివరించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా, ఉత్తర తెలంగాణలో ఇంకా ఎండలు మండుతున్నాయని చెప్పారు. రుతుపవనాల విస్తరణలో జాప్యమే ఇందుకు కారణమని, విస్తరణ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. నైరుతి ప్రభావంతో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, రెండు రోజుల క్రితం హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం పడిందని గుర్తుచేశారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం కచ్చితంగా ఉంటుందని, ఫలితంగా 90 శాతమే వర్షపాతం నమోదవుతుందని అంచనాలు ఉన్నాయని చెప్పారు.
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
ఇవాళ నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ, రేపు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రానున్న రెండు మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
రుతుపవనాలు పూర్తిగా విస్తరించాకే నిర్ణయం
రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించాక అల్పపీడన ద్రోణి తోడైతే మరింత విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని శ్రీనివాసరావు అంచనా వేశారు. అయితే ఈ ముందస్తు వర్షాలను చూసి రైతులు అప్పుడే పంటలకు సిద్ధం కావడం మంచిది కాదని సూచించారు. భూమి పదునయ్యేలా రుతుపవనాలు పూర్తిగా విస్తరించి కురిసిన వర్షాల ఆధారంగానే రైతులు సాగు నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాతావరణ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

