యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ
రూ.255 కోట్లతో మూడేళ్ల నిర్వహణకు టెండర్లు
జూన్ 29తో ముగియనున్న టెండర్ల గడువు
జూలై 2న వెల్లడికానున్న ఫలితాలు
ఆంధ్ర కంపెనీల చేతుల్లోకి ప్లాంట్ వెళ్తుందని ఉద్యోగుల ఆందోళన
ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటున్న వైటీపీఎస్ ఎంప్లాయీస్ జేఏసీ
ఉద్యమాల బాట పట్టనున్న 1300 మంది సిబ్బంది
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కీలక విద్యుత్ ప్రాజెక్టు అయిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్ కేంద్రం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. దాదాపు రూ. 255 కోట్ల వ్యయంతో, మూడేళ్ల కాల పరిమితి కోసం ఈ టెండర్లను ఆహ్వానించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 12వ తేదీన టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెలాఖరు వరకు అంటే జూన్ 29 వరకు టెండర్లను సమర్పించడానికి గడువు ఇచ్చారు. అనంతరం, జూలై 2వ తేదీన అధికారులు టెండర్లను తెరిచి, సంస్థలను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 1300 మంది సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఆందోళనలో 1300 మంది సిబ్బంది
నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుపరం చేయడం వెనుక గూఢమైన అర్థాలు ఉన్నాయని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రా కంపెనీల చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా స్థానిక ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడమే కాకుండా, విద్యుత్ కేంద్రంపై ఆంధ్రా పెత్తనం పెరుగుతుందని వైటీపీఎస్ ఎంప్లాయీస్ జేఏసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ ఉపాధికి భరోసా లేని ఇలాంటి నిర్ణయాలను కచ్చితంగా వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. “ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం” అని వైటీపీఎస్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. 1300 మంది ఉద్యోగుల పొట్టకొట్టేలా ప్రైవేటీకరణ ప్రక్రియ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రైవేటుపరం అయితే, తర్వాతి పరిణామాలు రాష్ట్ర ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం ఏమో దీనిని ‘నిర్వహణలో సామర్థ్యం పెంచేందుకే’ అని సమర్థించుకుంటున్నప్పటికీ, ఉద్యోగులు మాత్రం ఇది క్రమంగా ప్రాజెక్టును పూర్తిగా అమ్మేసే కుట్రలో భాగమని భావిస్తున్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రంపై నెలకొన్న ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ, విద్యుత్ శాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందా? లేక ఆందోళనల నేపథ్యంలో పునరాలోచన చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

