ఇవేం పనులు.. క్షమించేది లేదు!
సమస్య తీవ్రతను గుర్తించి స్పందించకపోవడం సరైంది కాదు
అంబేద్కర్ సెంటర్లో తక్షణమే సిమెంట్ రోడ్డు నిర్మించాలి
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
మిషన్ భగీరథ పనుల జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
రోడ్ల ధ్వంసం, పైప్లైన్ల లీకేజీలపై అసహనం
అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పర్యటన
కాకతీయ,కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పైపులైన్ పనుల జాప్యంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్ పనుల వల్ల ధ్వంసమైన రోడ్లను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు స్పందించకపోవడం సరైంది కాదని, పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించి లీకేజీలను అరికట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు రోడ్ల ధ్వంసం, పైప్లైన్ల లీకేజీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడరా అని నిలదీశారు. వారం రోజుల్లో మళ్లీ తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, అప్పటికి పనుల్లో ప్రగతి కనిపించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అంబేద్కర్ సెంటర్లో తక్షణమే సిమెంట్ రోడ్డు నిర్మించాలని, అది ప్రధాన జాతీయ రహదారి అయినందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్ పాల్గొన్నారు. వీరితో పాటు ఇంచార్జీ కమిషనర్ విజయానంద్, ఎలక్ట్రికల్ ఏడీఈ అబ్దుల్ రెహమాన్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, నామ కీర్తి, గొర్లె అన్నపూర్ణ, పైడిపల్లి జయలక్ష్మి, ఎస్. సుగుణ, మల్లెల స్వప్న కుమారి, దంతబోయిన నరేష్, నాయకులు వీ. పద్మజ, డి. సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, శెనగారపు శ్రీనివాసరావు, ఎస్.ఏ. రెహమాన్, గిరి, గొర్లె నరేష్, నామ పండు, ఆలపాటి ప్రసాద్, అల్లి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల డీఈలు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.

