అర్వపల్లి ఎస్సై ఈటా సైదులు సస్పెండ్
కీలక పోక్సో కేసులో అనుచిత ప్రమేయంపై చర్యలు
అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ కె. నరసింహ
కాకతీయ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా నాగారం సర్కిల్ పరిధిలోని అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈటా సైదులను జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో పాటు, ఒక కీలకమైన పోక్సో కేసు వ్యవహారంలో అనుచిత ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించారు.
నిందితుడైన ఎస్సై పలు కేసుల్లో సాక్ష్యాధారాలను తారుమారు చేయడంతో పాటు, అవినీతి మరియు అక్రమాలకు పాల్పడినట్లు స్థానికంగా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్సైపై తక్షణ చర్యగా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు కేసులో మరింత విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

