2010లో పట్టా.. రికార్డుల్లో మాయం..
అదృశ్యమైన సత్తవ్వ కుటుంబం భూహక్కులు
ఐదు దశాబ్దాలుగా సాగులో.. రెండేళ్లుగా భూ రికార్డుల సమస్యలు
పరిష్కారం కాక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
‘భూమి మాదే అయితే హక్కులివ్వండి.. లేదంటే నోటీసివ్వండి’
అధికారుల ముందు సత్తవ్వ కుటుంబ సభ్యుల వేడుకోలు
పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
కాకతీయ, చందుర్తి : ప్రభుత్వం ఇచ్చే పట్టా కాగితాలకే దిక్కులేకపోతే, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కముటం సత్తవ్వ కుటుంబమే ఒక నిదర్శనం. 2010లో ప్రభుత్వం అధికారికంగా పట్టా ఇచ్చిన భూమి, కొత్త పాసుపుస్తకాల జారీ సమయంలో రికార్డుల నుంచి మాయమైపోయింది. ఐదు దశాబ్దాలుగా అదే భూమిని సాగు చేసుకుంటున్నా, నేడు సర్కారు లెక్కల్లో ఆ రైతు కుటుంబానికి కనీసం ఉనికి లేకుండా పోయింది.
పట్టా ఇచ్చిన ప్రభుత్వమే.. పేరు తొలగించిందా?
సత్తవ్వ భర్త నర్సయ్యకు మల్యాల శివారులోని సర్వే నంబర్ 32/అలో 2 ఎకరాల 10 గుంటల భూమికి 2010లో అప్పటి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. అప్పటివరకు సాగులో ఉన్నా, అధికారికంగా పట్టా రావడంతో రైతు కుటుంబం ఎంతో సంబరపడింది. అయితే, ఆ తర్వాత వచ్చిన కొత్త పాసుపుస్తకాల ప్రక్రియలో సత్తవ్వ పేరు గాలిలో కలిసిపోయింది. ఆశ్చర్యకరంగా నేడు ధరణి రికార్డుల్లోనూ వీరి పేరు కనిపించడం లేదు. “గతంలో పట్టా ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు రికార్డుల నుంచి పేరును ఎందుకు తొలగించింది? మాకు సమాధానం చెప్పే నాథుడే లేడా?” అని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
రెండున్నరేళ్లుగా కార్యాలయాల చుట్టూనే..
సమస్య పరిష్కారం కోసం సత్తవ్వ కుటుంబం రెండున్నరేళ్లుగా తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చెప్పులు అరిగేలా తిరుగుతోంది. ప్రతిచోటా దరఖాస్తులు ఇస్తున్నా, విచారణ చేస్తామని చెబుతున్నారే తప్ప, సమస్యను పరిష్కరించేందుకు అధికారుల అడుగు ముందుకు పడటం లేదు. అధికారుల నిర్లక్ష్యమో, రికార్డుల మాయాజాలమో తెలియదు కానీ, ఒక పేద రైతు కుటుంబం మాత్రం న్యాయం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
పంట మనది.. అమ్మేది ఇతరుల పాసుపుస్తకాలతో!
ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన పంటను కూడా తమ పేరుతో విక్రయించుకోలేని దుస్థితి వీరిది. సొంత భూమిలో పంట పండిస్తున్నా, రైతుబంధు రాదు, బ్యాంకు రుణాలు దక్కవు, కనీసం రైతు బీమా కూడా అందదు. ధాన్యం విక్రయించాలంటే ఇతరుల పాసుపుస్తకాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. “సాగు చేస్తున్నది మేము.. కష్టపడుతున్నది మేము.. కానీ రికార్డుల్లో మాత్రం రైతు మరొకరు! ఇది ఎలాంటి పరిపాలనా అన్యాయం?” అని బాధిత రైతు కుటుంబం వేదన వ్యక్తం చేస్తోంది.
ఎక్కడ జరిగింది పొరపాటు?
2010లో పట్టా ఇచ్చిన భూమి రికార్డుల నుంచి ఎలా మాయమైంది? కొత్త పాసుపుస్తకాల సమయంలో జరిగిన తప్పును సరిదిద్దడానికి ఇన్ని ఏళ్లు ఎందుకు పడుతోంది? ధరణిలో పేర్లు నమోదు చేయకపోవడానికి బాధ్యులెవరు? లింగంపేట గ్రామానికి చెందిన సత్తవ్వ కుటుంబానికి జరిగిన ఈ పరిపాలనా అన్యాయంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అసలు నిజానిజాలను వెలికితీయాలి. అర్హులైన ఆ కుటుంబానికి భూ హక్కులను కల్పించి, ఇప్పటివరకు కోల్పోయిన రైతుబంధు, ఇతర సాయాన్ని కూడా అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల ఓ రైతు కుటుంబం తన భూమిపైనే పరాయివాడిగా మిగిలిపోవడం దారుణమని వారు మండిపడుతున్నారు.

