ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసులు పెడుతోంది
ప్రజా పోరాటాలకు ప్రభుత్వం భయపడుతోంది
బాల్క సుమన్‌పై పెట్టిన కేసులపై పార్టీ న్యాయ పోరాటం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బాల్క సుమన్ కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని సుమన్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో సాగుతున్న అక్రమాలను ఎండగట్టినందుకే సుమన్‌ను భయపెట్టేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జైలుకు పంపడం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజా పోరాటాలకు భయపడుతోందని, అందుకే ఇలాంటి అక్రమ కేసులతో నాయకులను వేధిస్తోందని మండిపడ్డారు.
అండగా బీఆర్ఎస్ పార్టీ
ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అక్రమ కేసులపై పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని, అలాగే ప్రజాక్షేత్రంలోనూ ఈ అక్రమ నిర్బంధంపై గట్టిగా పోరాడుతామని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో నాయకులను, కార్యకర్తలను భయపెట్టలేరని, ప్రజలన్నీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

