30న సీఎం ‘రైతు ఆశీర్వాద సభ’
వర్షం కురిసినా అంతరాయం కలగకుండా ఏర్పాట్లు
రైతుల ఖాతాల్లో ధాన్యం నగదు జమ చేశాం
అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ,ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్, కమిషనర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను మంత్రి సమగ్రంగా తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినా కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేయాలని, తగిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతుల ఖాతాల్లో వారం రోజుల్లోనే నగదు జమ
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఎదురైనా రైతు ఆశీర్వాద సభ అనుకున్నదానికంటే మరింత ఘన విజయాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సభ రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల వర్షాలకు తడిసిన ధాన్యానికి సైతం నష్టం కలగకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దానికి సంబంధించిన చెల్లింపులను వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసి నిబద్ధతను చాటుకున్నామని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తూముల నాగేశ్వరరావుల సమన్వయంతో ఈ సభను రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయేలా విజయవంతం చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ వెల్లువ
ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కేవలం రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రూ.22 వేలు కోట్లు మంజూరు చేయడం అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

