బ్యారేజీల్లో నీటి నిల్వ చేయకుండా ప్రభుత్వం కుట్ర
పంపులు నడపడం చాతకాకుంటే కేసీఆర్‌కు అప్పగించండి
వారం రోజుల్లో రైతుల భూముల్లోకి నీరు పారించి చూపుతాం
లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం
ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ఇసుక దందా కోసమే బ్యారేజీల్లో నీరు నింపడం లేదు : మాజీ ఎంపీ వినోద్‌కుమార్
చలో కన్నేపల్లికి సిద్ధం : మాజీ మంత్రి గంగుల
కాకతీయ,తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని బీఆర్ఎస్ మాజీమంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డిలు మండిపడ్డారు. గోదావరిలో సాగుతున్న ఇసుక దందా కోసమే బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయకపోవడం వెనుక ప్రభుత్వ అసమర్థత మరియు ఇసుక దందా ఉందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో మాజీమంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ “ప్రాజెక్టు నిర్వహణ చేతకాకపోతే వారం రోజుల పాటు మా నేత కేసీఆర్‌కు అప్పగించండి. మేము రైతుల పొలాల్లోకి నీరు పారించి చూపుతాం. ఒకవేళ ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత బీఆర్ఎస్దే. అప్పుడు మేము పార్టీని రద్దు చేసుకుని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం” అని సవాల్ విసిరారు.
చంద్రబాబు కోసం నాటకం ఆడుతున్న ప్రభుత్వం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం ఈ నాటకం ఆడుతోందని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్డీఎస్ఏ పేరుతో భయపెడుతూ ప్రాజెక్టును నిలిపివేయడం దారుణమన్నారు. ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, కోర్టుల్లో ప్రభుత్వం వేసిన కమిషన్లకు కూడా మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం, కమీషన్ల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇసుక దందా కోసమే నీరు నింపడం లేదు
మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డతో సంబంధం లేకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నింపడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద వందల లారీలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అందుకే బ్యారేజీల్లో నీరు నింపడం లేదు. అన్నారం, సుందిళ్ల సురక్షితంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నా, ప్రభుత్వం ఎందుకు పంపులు ఆపుతోందని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదని, భద్రాచలం కొట్టుకుపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు.
చలో కన్నేపల్లికి సిద్ధం : మాజీమంత్రి గంగుల
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి, కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘ఛలో కన్నేపల్లి, ఎల్లంపల్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రాజెక్టు నీటి నిల్వపై ప్రభుత్వం ఎన్డీఎస్ఏతో ఒక్కసారైనా మాట్లాడిందా అని ప్రశ్నించారు. రైతుల కోసం, కరువు నుంచి ప్రజలను రక్షించడం కోసం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కడితే, నేడు ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ తెలంగాణ ఆత్మను కోల్పోతోందని మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఈ కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ధర్మేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

