కేసులు తొలగించేదెప్పుడు..?!
తెలంగాణ ఉద్యమకారుడి ఆవేదన
కాకతీయ, చేర్యాల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో నమోదైన కేసులు పదేళ్లు గడిచినా ఇంకా కొనసాగుతుండటంపై ఉద్యమకారులు తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విచారణ నిమిత్తం చేర్యాల కోర్టుకు హాజరైన పలువురు ప్రముఖ ఉద్యమకారులు, తమను వేధిస్తున్న కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినప్పటికీ, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉండటంతో ప్రతిసారీ కోర్టుకు హాజరు కావాల్సి వస్తోందని వారు వాపోయారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, మానసిక వేదనకు గురవుతున్నామని పేర్కొన్న వారు, తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మమ్మల్ని నేడు కోర్టుల చుట్టూ తిప్పడం బాధాకరమని ఆవేదన చెందారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, పాత కేసులన్నింటినీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ జలమండలి చైర్మన్ మొగుళ్ల రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత్ రెడ్డి, బూరుగు సురేష్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మేకల కళింగ రాజు, మాజీ సర్పంచులు వల్లూరి శ్రీనివాస్, కోనేటి స్వామి, బూడిద కిష్టయ్య, రఘువీరారెడ్డి, తిప్పారపు ఆనంద్, ముషిని బాబు తదితరులు కోర్టుకు హాజరై తమ ఆవేదనను తెలియజేశారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పెండింగ్లో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని వారు కోరారు.

