ఎన్నెస్పీ భూ ఆక్రమణలను తొలగించాలి
కలెక్టరుకు సీపీఐ వినతి
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం కార్పొరేషన్ 12వ డివిజన్‌లో ఎన్నెస్పీకి చెందిన స్థలాలను కొందరు సంపన్నులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆక్రమించి అద్దెలకు ఇస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ నాయకులు సోమవారం జిల్లా కలెక్టరుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ మాట్లాడుతూ.. 12వ డివిజన్‌లో ఎన్నెస్పీ కాలువ స్థలాలను ఆక్రమించి దుకాణాలు నిర్మించారని, గతంలో పేదలను ఖాళీ చేయించిన వారే ఇప్పుడు ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొందరు 58, 59 జీవోల కింద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిని వెంటనే తిరస్కరించాలని కోరారు. ఆ ప్రభుత్వ స్థలంలో గ్రీన్ పార్కును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో ఆముదాల వెంకన్న, జాకీర్, అక్రం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

