ఇసుక అక్రమ రవాణాను..వసూళ్లను అరికట్టండి
ఏపీ నుంచి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి
టీజీఎండీసీ జీఎం ఎల్లయ్యకు లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతల వినతి
ర్యాంపుల వద్ద కాంట్రాక్టర్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణా, ర్యాంపుల వద్ద జరుగుతున్న అదనపు వసూళ్లపై పెద్ద అంబార్‌పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ (జీఎం) ఎల్లయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న లారీ యజమానులకు అక్రమ రవాణా, ఓవర్‌లోడ్ లారీలు శాపంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు పోలగోని భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, కర్నూలు ప్రాంతాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు, చట్టబద్ధంగా పనిచేసే వారికి నష్టం వాటిల్లుతోందని తెలిపారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా డిండి పరిసరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే లోకల్ ఇసుక రవాణా, ఓవర్‌లోడ్ లారీలు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ర్యాంపుల వద్ద దోపిడీ..
టీజీఎండీసీ నిర్ణయించిన డీడీ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, ర్యాంపుల వద్ద కాంట్రాక్టర్లు ఒక్కో లారీకి అదనంగా రూ.2,500 నుంచి రూ.3,000 వరకు లోడింగ్ పేరుతో వసూలు చేస్తున్నారని ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇసుక రేట్లు తక్కువగా ఉండటం, డీజిల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యజమానులపై, ఈ అక్రమ వసూళ్లు మరిన్ని భారం మోపుతున్నాయని వారు వాపోయారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, ఇసుక ర్యాంపుల వద్ద తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని వారు కోరారు. అనుమతులు లేని లోకల్ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మునుకుంట్ల బలరాం గౌడ్, పేదగోని నర్సింహా, సభ్యులు మునుకుంట్ల శ్రీను, బోయపల్లి ప్రవీణ్, ముక్కర్ల లింగస్వామి, వంటల గణేష్, శంకర్, వర్థం లింగస్వామి, వంటల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

