తోగూడెం క్వారీల అక్రమం
సీపీసీబీ సీజ్ చేసినా జిల్లా మైనింగ్ ఏవోపై చర్యలేవి?
వందల కోట్ల ప్రభుత్వ సంపదను కొల్లగొట్టినా మౌనం
జిల్లా మైనింగ్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి
సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : జిల్లా కలెక్టరేట్ కళ్లెదుటే వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతున్నా జిల్లా యంత్రాంగం పచ్చజెండా ఊపుతోందని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన విలేకర్లతో మాట్లాడారు. పాల్వంచ మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆరు అక్రమ క్వారీలపై సేవాలాల్ సేన గతంలో పలుమార్లు జిల్లా మైనింగ్ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్వయంగా విచారించి ఆరు క్వారీలను సీజ్ చేశారని తెలిపారు. గత నెల 29న ప్రజావాణిలో కలెక్టర్‌కు సమగ్ర ఆధారాలతో వినతిపత్రం ఇచ్చినా, దానిని తిరిగి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే మైనింగ్ అధికారికి విచారణకు పంపడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన జిల్లా మైనింగ్ అధికారిని వెంటనే విధుల నుండి తొలగించి, సమగ్ర విచారణతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇకనైనా మౌనం వీడి తక్షణమే స్వతంత్ర విచారణకు ఆదేశించకపోతే ఈ నెల 27వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీ కార్యాలయాన్ని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు రావు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు, యువత, పర్యావరణ పరిరక్షకులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయక్, గణేష్ నాయక్, అశోక్ నాయక్, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

