జైలుభరో విజయవంతం చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
ఆగస్టు 10న కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10న నిర్వహించనున్న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక చందర్రావు భవన్‌లో సీఐటీయూ జిల్లా నాయకుడు ఎర్రంశెట్టి వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన భద్రాచలం పట్టణ సీఐటీయూ విస్తృతస్థాయి జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. వాటిని రద్దు చేయించేందుకు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మూడు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జైలు భరో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్మికవాడల్లో అవగాహన కల్పించాలి
జైలు భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జైళ్లను నింపాలని ఏజే రమేష్ అన్నారు. బెదిరింపులు, కేసులకు కార్మికులు వెనక్కి తగ్గబోరని, గత పోరాటాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జైలు భరో విజయవంతం కోసం అన్ని కార్మికవాడల్లో విస్తృతస్థాయి జనరల్ బాడీ సమావేశాలు, గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించి కార్మిక కుటుంబాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంవీ నర్సారెడ్డి, గడ్డం స్వామి, కొలగాని రమేష్, నకిరేకంటి నాగరాజు, చంద్రలీల, వెంకటరమణ, పిట్టల రాజు, అజయ్ కుమార్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

