ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమం
మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం
రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలతో మహిళలకు అండ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చండ్రుగొండ మండలంలో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంగయ్య బంజార గ్రామానికి 24 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ ఫలాలు చేరవేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మంగయ్య బంజార గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో మంగయ్య బంజారు–గానుగపాడు గ్రావెల్ రహదారి, కల్వర్టు నిర్మాణం, ఇల్లంగి బాబు ఇంటి నుంచి కాజ్‌వే వరకు సీసీ రోడ్డు, కాజ్‌వే నుంచి గానుగపాడు రహదారి వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదే సందర్భంగా గ్రామానికి 24 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధి
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పులతో వదిలి వెళ్లినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. రెండేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇటీవల మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని చెప్పారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతు సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక భద్రతా పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టామని, తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, చంద్రుగొండ తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, పంచాయతీ అధికారి అనూష, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

