- వరంగల్ ఎంజీఎంలో పని చేయని పీఆర్వో ఫోన్ నంబర్!
- నోటీస్ బోర్డుపై రాసిన నంబర్ కు ఎంతకొట్టినా మోగని ఫోన్ అందుబాటులో లేదంటూ వచ్చే
- సమాచారంతో రోగుల అటెండెంట్ల ఇబ్బందులు
- పట్టించుకోని సిబ్బంది.. అడిగితే అదే నంబర్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం పని చేయని నంబర్ తో రోగుల బంధువుల మనోభావాలతో చెలగాటం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్న పాట వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందేమో! ఇప్పటికే వైద్యులు సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు కూడా సక్రమంగా లేవనే వాదనలు ఉన్నాయి. చివరకు రోగుల సమస్యలపై స్పందించేందుకు నియమించిన పీఆర్వో కూడా అందుబాటులో లేకపోవడం తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఆర్వో ఎక్కడ ఉంటాడో తెలియకపోయినా కనీసం ఆయన ఫోన్ చేసైనా సాయం కోరుదామనుకున్న వారికి నిర్వేదమే మిగులుతోంది. ఎప్పుడు, ఎన్ని సార్లు చేసినా నాట్ రీచబుల్ అనే సమాధానంతో రోగుల బంధువులు అసహనానికి గురి కావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
నలుగురు పీఆర్వోలు!
ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు సాయమో, సమాచారమో అందించేందుకు నలుగురు పీఆర్వోలను నియమించారు. వారికి ఒక ఫోన్ నంబర్ కేటాయించారు. ఈ నంబర్ ఏనాడు పనిచేసిన దాఖలాలు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చేసినా నాట్ రీచబుల్ లేదా మీరు డయల్ చేసిన మరొకసారి సరిచూసుకోండి.. అనే సమాధానంతో రోగులు విసుగు చెందుతున్నారు. పీఆర్వో గురించి ఆరా తీసినా.. ఎంజీఎం సిబ్బంది కూడా సరిగా స్పందించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అడిగినా, ఎన్ని సార్లు అడిగినా పీఆర్వో వార్డుల్లో ఉన్నారనో, లేదంటే నోటీస్ బోర్డుపై ఉన్న నంబరు ఫోన్ చేయమనే సమాధానం తప్పా.. పీఆర్వో గురించిన వివరాలు ఇవ్వడానికి ఎవరూ సాహసించడం లేదు.
అసలు పీఆర్వోలు ఉన్నారా?
ఆస్పత్రిలో నలుగురు పీఆర్వోలు ఉన్నారని, ఒక ఫోన్ నంబర్ ఉందని ఎంజీఎం అధికారులు, సిబ్బంది చెబుతుండగా, అసలు పీఆర్వోలు ఉన్నారా? లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఉంటే ఫోన్ నంబర్ పనిచేయాలి కదా! అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పీఆర్వోలు లేకుండానే ఫోన్ నంబర్ పేరిట నెలనెల పీఆర్వోల వేతనం నొక్కేస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉండగా, నోటీస్ బోర్డుపై ప్రదర్శించిన నంబర్ పనిచేయకపోవడానికి బిల్లు చెల్లించకపోవడమని పలువురు పేర్కొంటున్నారు. ఎంజీఎం సిబ్బందిలో పరిచయస్తులు ఉంటే గానీ, పీఆర్వోల నంబర్ దొరకని పరిస్థితి నెలకొంది. లేదంటే పీఆర్వోను సంప్రదించాలనుకునే వారికి నిర్వేదమే మిగులుతోంది.

