ఫన్ పేరుతో ర్యాగింగ్ చేస్తే జైలుకే
జూనియర్లకు అండగా నిలవాలి.. భయపెట్టొద్దు
డ్రగ్స్, బాల్యవివాహాలు భవిష్యత్తును నాశనం చేస్తాయి
మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి
న్యాయ చైతన్య సదస్సులో విద్యార్థులకు అవగాహన
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: ఫన్ పేరుతో ర్యాగింగ్ చేయడం సరదా కాదని, అది నేరుగా జైలుకు తీసుకెళ్లే చట్టవిరుద్ధమైన చర్య అని మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి హెచ్చరించారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్ విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధించే నేరమని, సీనియర్లు జూనియర్లను భయపెట్టకుండా సోదరభావంతో మార్గనిర్దేశం చేయాలని సూచించారు. గౌరవం బెదిరింపులతో కాదని, వ్యక్తిత్వంతో సంపాదించుకోవాలని చెప్పారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాల సమాచారం తెలిసినా వెంటనే కళాశాల యాజమాన్యం లేదా పోలీసులకు తెలియజేయాలని కోరారు. బాల్యవివాహాలు కూడా చట్టరీత్యా నేరమని, ర్యాగింగ్, డ్రగ్స్, బాల్యవివాహాలకు పాల్పడినా లేదా సహకరించినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మణుగూరు సీఐ పాటి నాగబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుకృష్ణ, న్యాయవాదులు, కళాశాల ప్రిన్సిపాల్ సత్యప్రకాశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

