నవజాత శిశువుకు రక్షణ కవచం తల్లిపాలే
తొలి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరి
ముర్రుపాలే శిశువుకు తొలి అమృతం
జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత
కొత్తగూడెం బస్టాండ్‌లో తల్లిపాలిచ్చే గది ప్రారంభం
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: నవజాత శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత కూడా మరో సంవత్సరం పాటు తల్లిపాలను కొనసాగించడం తల్లి, బిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత తెలిపారు. శనివారం కొత్తగూడెం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన తల్లిపాలిచ్చే గదిని ఆమె ప్రారంభించారు. ప్రసవించిన తొలి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని, ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు తప్ప ఇతర ఆహారం అవసరం లేదని చెప్పారు. శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాలలోనే ఉంటాయని వివరించారు.బిడ్డ పుట్టిన వెంటనే తేనె, పంచదార ఇవ్వడం వంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని, ముర్రుపాలే శిశువుకు అమృతమని స్వర్ణలత సూచించారు. కార్యక్రమంలో అర్బన్ సీడీపీఓ, సూపర్‌వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, మహిళా సాధికారిత బృందం, ఆర్టీసీ డిపో మేనేజర్, సిబ్బంది, బాలింతలు పాల్గొన్నారు.

