బతికుండగా భారమై… చనిపోయాక ఆస్తై..!
90 ఏళ్ల వృద్ధురాలి జీవితాంతం కన్నీటి గాథ
పోషణ కోసం ఉంచుకున్న 8 ఎకరాల భూమిపైనే కన్ను
నాయనమ్మను పట్టించుకోలేదనే మనవడిపై గ్రామంలో ఆరోపణలు
భూముల బదిలీ వ్యవహారంపై విచారణకు స్థానికుల డిమాండ్
కాకతీయ,కొత్తగూడెం/ జూలూరుపాడు : ఒకప్పుడు కుటుంబం కోసం కష్టపడి ఆస్తులు కూడబెట్టిన పెద్దలు.. వృద్ధాప్యంలో అదే ఇంట్లో పరాయివారిగా మారిపోతున్న విషాద ఘటనలు పెరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వెలుగుచూసిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బతికున్నప్పుడు ఆదరణ దక్కని ఓ వృద్ధురాలి చుట్టూ ఇప్పుడు ఆస్తి వివాదం నెలకొనడం మానవ సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇటీవల మృతి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు తన కుమారుడికి గతంలోనే సుమారు 25 ఎకరాల భూమిని ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వృద్ధాప్యంలో తన పోషణ కోసం మిగిలిన సుమారు 8 ఎకరాల భూమిని తన పేరునే ఉంచుకున్నట్లు సమాచారం. అయితే, ఆ భూమిని దశాబ్దం క్రితమే ఆమెకు తెలియకుండా తన పేరుకు మార్చించుకున్నాడనే ఆరోపణలు ఆమె మనవడిపై వినిపిస్తున్నాయి. అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ ప్రక్రియ జరిగిందనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
బతికున్నప్పుడు ఆదరణే కరువు
గ్రామస్తుల కథనం ప్రకారం, వృద్ధురాలు జీవించి ఉన్న సమయంలో ఆమెకు తగిన సంరక్షణ లభించలేదని చెబుతున్నారు. చివరి రోజుల్లో అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కుటుంబ సభ్యులు పరామర్శించలేదని ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరణానంతరం అంత్యక్రియల బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించలేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, అదే కుటుంబానికి చెందిన వృద్ధురాలి కుమారుడికీ చివరి రోజుల్లో తగిన ఆదరణ లభించలేదని చెబుతున్నారు. ఆసుపత్రిలో మరణించిన అనంతరం కూడా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం, భూముల బదిలీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వృద్ధుల హక్కులు, వారి ఆస్తుల రక్షణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బతికున్నప్పుడు ఆదరించని బంధాలు.. మరణానంతరం ఆస్తి కోసం పోటీ పడటం సమాజంలో మానవ విలువలు ఎంతగా క్షీణించాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

