విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతే ప్రధానం
ఏటూరునాగారం సబ్ డివిజన్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన
భద్రతా పరికరాల వినియోగంపై కచ్చితంగా దృష్టి
ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏడీఈ ఉమారావు
కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏడీఈ ఉమారావు సూచించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో వెంకటాపురం, ఏటూరునాగారం ప్రాంతాల యూన్‌మ్యాన్‌లు, ఎమర్జెన్సీ బ్రేక్‌డౌన్ సిబ్బంది, స్పాట్ బిల్లర్లకు విద్యుత్ ప్రమాదాల నివారణ, భద్రతా పరికరాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమారావు మాట్లాడుతూ విధులు నిర్వహించే సమయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఇటీవల చోటుచేసుకుంటున్న విద్యుత్ ప్రమాదాల కారణాలను వివరించి, అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. కొత్తగా నియమితులైన ఎమర్జెన్సీ బ్రేక్‌డౌన్ సిబ్బందికి వోల్టేజ్ ఇండికేటర్లను అందజేశారు.
భద్రతా పరికరాల వినియోగం తప్పనిసరి
ఏటూరునాగారం లైన్‌మెన్ రాజమల్లయ్య మాట్లాడుతూ యూన్‌మ్యాన్‌లు, ఎమర్జెన్సీ బ్రేక్‌డౌన్ సిబ్బంది విధుల సమయంలో ఎర్త్ డిశ్చార్జ్ రాడ్, సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ జాకెట్ తదితర భద్రతా పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. భద్రతా పరికరాలను నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ప్రమాదాలను తన అనుభవాల ద్వారా వివరించి సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యుత్ పనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు.

