బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం
ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున అందజేత
నేడు సచివాలయంలో పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో మిషన్లను అందించనుండటం ఈ పథకం ప్రత్యేకత. ఆగస్టు 13న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని జీ-29లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు హాజరుకానున్నారు.
ఇంటి వద్దే స్వయం ఉపాధి
కుట్టు వృత్తిలో నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా మహిళల ఆదాయం పెరగడంతో పాటు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది. మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆదాయం ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. పథకానికి సంబంధించిన విధివిధానాలు, బడ్జెట్ కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఈ పథకం కీలక ముందడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

