చుంచనకోటలో ఇక 24 గంటల నిఘా
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు చర్యలు
ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ
ప్రజలు, వ్యాపారులు కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
సిద్ధిపేట కమిషనరేట్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్
కాకతీయ, చేర్యాల : చుంచనకోట గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బుధవారం అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కెమెరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. దొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకోవడంతోపాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు కెమెరాల ఫుటేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లు, దుకాణాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
గ్రామ భద్రతకు ప్రాధాన్యం
సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అన్నారు. గ్రామంలో కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. గ్రామ రక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టిన సర్పంచ్‌ను గ్రామ పెద్దలు అభినందించారు. కార్యక్రమంలో చేర్యాల సీఐ రమేష్ నాయక్, ఎస్‌ఐ అపూర్వ రెడ్డి, ఉపసర్పంచ్ వట్టిపల్లి ఆగయ్య, వార్డు సభ్యులు మంద వెంకట్ రెడ్డి, వడ్లకొండ వెంకటేశం, శ్రీపతి కమలేష్, శీర్ల శ్రీకాంత్, గ్రామ వీఓపీ రంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, కారోబార్ రమేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

