నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి
నీటి కొరత ఏర్పడే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలి
తాలిపేరు ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ అంకిత్
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తాలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు, ఏకలవ్య మోడల్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తాలిపేరు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ప్రస్తుత నీటిమట్టం, నీటి ప్రవాహం, విడుదల, ప్రాజెక్టు నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 73.80 మీటర్ల నీటిమట్టం ఉందని, పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రాజెక్టుకు ప్రధానంగా నీటి ప్రవాహం వస్తోందని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇన్‌ఫ్లో తక్కువగా ఉందని వివరించారు. బుధవారం సుమారు 2,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై దృష్టి
అనంతరం ఏకలవ్య మోడల్ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థుల హాజరు, వసతులు, భోజనం, వైద్య సేవలు, పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. పాఠశాలలోని హెల్త్ సెంటర్‌ను సందర్శించి మందుల నిల్వ, వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షల వివరాలను ఏఎన్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు విద్య, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పర్యటనలో తహసీల్దార్, ఇరిగేషన్, విద్యాశాఖ, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

