మోదీకి ట్రంప్ ఫోబియా!
తప్పు చేయకపోతే జంకు ఎందుకు?
కమ్యూనిస్టులతోనే దేశంలో మార్పు తథ్యం
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హామీలు అమలు చేయకుంటే ఆందోళన
: సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం
: సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా
కాకతీయ, ఖమ్మం టౌన్ : ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోబియా పట్టుకుందని, 145 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా ఉన్న ఆయన పిరికివాడిగా మారిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. తప్పు చేయనప్పుడు పార్లమెంట్‌కు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దేశంలో ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, సంక్షేమ పథకాలు కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని, రానున్న రోజుల్లో దేశంలో మార్పు కూడా కమ్యూనిస్టుల పోరాటాలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం పోరాడతామని, ఒకటి రెండు సీట్ల కోసం ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. సీపీఐ జన చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. జడ్పీ సెంటర్ నుంచి పాత బస్టాండ్, మయూరి సెంటర్ మీదుగా భక్తరామదాసు కళాక్షేత్రం వరకు సాగిన ప్రదర్శనలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, కళాకారులు పాల్గొన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు.

ప్రజల హక్కులు పోరాటాల ఫలితమే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, సంక్షేమ పథకాలు కమ్యూనిస్టులు సాగించిన ఉద్యమాల ఫలితంగానే వచ్చాయని కూనంనేని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తిగా ఆర్థిక వ్యవహారంగా మారిపోయాయని, కోట్ల రూపాయలు ఖర్చు చేసే వారే గెలిచే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ఎక్కువ సీట్లు గెలవకపోవచ్చు కానీ.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే, గెలుపోటములను శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉందన్నారు. మోదీ, అమిత్‌షాలు తప్పు చేశామనే భావనతోనే పార్లమెంట్‌కు వచ్చేందుకు జంకుతున్నారని ఆరోపించారు. మోదీ పాలనకు తిరోగమనం ప్రారంభమైందని, అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామంతో మోదీ అహంకారం దిగిపోయిందని వ్యాఖ్యానించారు. యువతలో ఉద్యమ స్ఫూర్తి పెరుగుతోందని, బీజేపీ అధికారం కోల్పోవడమే ఇక మిగిలిందని అన్నారు. కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా పురోగమిస్తున్నారని, అందుకే అక్కడ ట్రంప్, ఇక్కడ మోదీ ఆందోళన చెందుతున్నారని కూనంనేని వ్యాఖ్యానించారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు దేశంపై దోపిడీ దండుగా పడ్డాయని ఆరోపిస్తూ.. ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజాగ్రహానికి గురికాక తప్పదు :సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు
తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు ఆరోపించారు. సన్నబియ్యం, ఉచిత బస్సు మినహా మిగిలిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. అప్పులున్నాయనే పేరుతో హామీలను వాయిదా వేస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో వ్యవహరించిన తీరులోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ వివక్ష చూపుతోందని ఆరోపించారు. పార్టీ జెండా కప్పుకుంటేనే ఇళ్లు కేటాయిస్తామన్న ధోరణి సరికాదన్నారు. సీతారామ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రాష్ట్రంలో ఎన్నికల హామీల అమలుపైనా సీపీఐ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రశ్నిస్తూనే ఉంటామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. గెలుపోటములు ఎన్నికల వరకే పరిమితమని, ప్రజా సమస్యల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదన్నారు. ఖమ్మం జిల్లాలో ఈసారి పోటీ తథ్యమని ప్రకటించారు. సభలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు ప్రసంగించారు. జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించారు. సీపీఐ నగర కార్యదర్శి షేక్ జానీమియా, రాష్ట్ర సమితి సభ్యులు ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, బిజి క్లైమెంట్, అజ్మీరా రామమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు సతీష్ బృందం ఆలపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి.

