మహిళా శక్తిని వ్యాపార శక్తిగా మార్చడమే లక్ష్యం
మహిళలు ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
ఇంక్యుబేటర్ కార్యక్రమంతో మహిళా వ్యాపారాలకు కొత్త దిశ
రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు గ్రాంట్ పొందే అవకాశం
మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సహాయక సంఘాల సభ్యులను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మహిళలు ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సెర్ప్, బిట్స్ పిలానీ హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ అవగాహన, ప్రణాళిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
రూ.15 లక్షల వరకు గ్రాంట్
గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను గుర్తించి, వాటికి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఆర్థిక సహకారం అందించడమే కార్యక్రమం ఉద్దేశమని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మహిళా ఆధారిత వ్యాపారాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపార విస్తరణ, యంత్రాలు, పరికరాలు, ముడిసరుకు తదితర అవసరాల కోసం రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు గ్రాంట్ పొందే అవకాశం ఉందన్నారు.
ములుగులో రూ.13 కోట్ల వడ్డీ చెల్లింపు
మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని సీతక్క అన్నారు. వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు మహిళా సంఘాల రుణాలపై వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ములుగు జిల్లాలో ఇప్పటివరకు సుమారు రూ.13 కోట్ల వడ్డీ మొత్తాన్ని మహిళలకు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు మండల సమాఖ్యలకు బస్సులు అందించి ఆదాయ మార్గాలు కల్పిస్తున్నామని తెలిపారు.
మేడారం, రామప్ప, లక్నవరం, బొగత జలపాతం, గోదావరి తీరం వంటి పర్యాటక ప్రాంతాలను మహిళల ఆర్థికాభివృద్ధికి అనుసంధానం చేయాలని మంత్రి సూచించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్లు, మొబైల్ టిఫిన్ కేంద్రాలు, స్థానిక ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పపువ్వు, అరటి, మిరప వంటి స్థానిక ఉత్పత్తులకు విలువ జోడించి ప్యాకేజింగ్, మార్కెటింగ్ చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి మండలం నుంచి వ్యాపార ఆసక్తి, వినూత్న ఆలోచనలు ఉన్న మహిళలను గుర్తించి ఇంక్యుబేటర్ శిక్షణకు ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ఆగస్టు 16న సమ్మక్క–సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించనున్నట్లు సీతక్క తెలిపారు. అలాగే జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, డీఆర్డీఓ రవీందర్, బిట్స్ పిలానీ ఇంక్యుబేటర్ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్‌కృష్ణ, ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

