ఏనుమాముల మార్కెట్లో ఏం జరుగుతోంది?
విచారణ అధికారికమా.. మామూలుగానే సాగుతోందా?
పెద్ద మార్కెట్లో చిన్నస్థాయి మార్కెట్ అధికారులు పరిశీలనా?
రికార్డుల పరిశీలనపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
2024-25, 2025-26 లావాదేవీలపై బృందం ఆరా
పత్తి, మిర్చి, పసుపు, పల్లికాయ, మామిడి కొనుగోళ్లపైనా ఆరోపణలు
విజిలెన్స్ కాకుండా మార్కెట్ ఉద్యోగులతోనే తనిఖీలు ఎందుకు?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు చెందిన కొందరు ఉద్యోగులతో కూడిన బృందం ఏనుమాముల మార్కెట్లో పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది మార్కెట్లో జరిగిన వివిధ సరుకుల లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈ బృందం ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ పరిశీలన అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్కెట్లో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు అధికారికంగా విచారణ చేపట్టారా? లేక ఇతర మార్కెట్ల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియలో భాగంగా రికార్డులను పరిశీలిస్తున్నారా? అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాత ఆరోపణల నేపథ్యంలో తాజా పరిశీలన
ఏనుమాముల మార్కెట్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో మార్కెట్లో పనిచేసిన కొందరు ఉన్నతస్థాయి ఉద్యోగులు సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. పత్తి కొనుగోళ్లు, సాగు విస్తీర్ణంలో వ్యత్యాసాలు వెలుగులోకి రావడంతో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు అప్పట్లో చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్కెట్ రికార్డుల పరిశీలనకు రాష్ట్రంలోని ఇతర మార్కెట్ల ఉద్యోగులతో బృందాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోదాడ మార్కెట్ కార్యదర్శి కాజా మోహియుద్దీన్, కరీంనగర్ మార్కెట్ సెక్రటరీ మహమ్మద్ హామీర్, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మార్కెట్ కార్యదర్శి సతీష్ కుమార్, హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చందర్లతో కూడిన బృందాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. 2024-25, 2025-26 మార్చి నాటికి జరిగిన లావాదేవీలను పరిశీలించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించినట్లు సమాచారం.
ఒకరోజు రికార్డులతో అక్రమాలు బయటపడేనా?
తాజాగా నాలుగైదు రోజులుగా మార్కెట్లోని లావాదేవీలను బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పత్తి, మిర్చి, పసుపు, పల్లికాయ, మామిడి తదితర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పరిశీలనలో భాగంగా కేవలం ఒకరోజు రికార్డులను మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలుస్తుండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గతంలో జరిగిన లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నప్పుడు పరిమిత రికార్డులను పరిశీలించడం ద్వారా పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్కెట్లోనే కాకుండా సంబంధిత వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, రైతుల నుంచి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. లావాదేవీల రికార్డులతో పాటు వాస్తవంగా జరిగిన కొనుగోళ్లు, సరుకు రాక, బరువులు, ధరలు, చెల్లింపులు తదితర అంశాలను సరిపోల్చితేనే పూర్తి చిత్రం బయటపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
‘మార్కెట్ ఉద్యోగులే.. మార్కెట్ ఉద్యోగులపైనేనా?’
రికార్డులను పరిశీలిస్తున్న బృందంలోనూ మార్కెట్ శాఖకు చెందిన ఉద్యోగులే ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏనుమాముల వంటి రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చోట ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అదే శాఖకు చెందిన ఇతర మార్కెట్ల ఉద్యోగులతో పరిశీలన చేయించడం ఎంతవరకు సమర్థవంతమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ‘నీది తెలంగాణే.. నాది తెలంగాణే’ అన్న చందంగా పరస్పరం ఉద్యోగులే రికార్డులను పరిశీలిస్తే అక్రమాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉందా? అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా లోపాలు, అక్రమాలు గుర్తించినా వాటి తీవ్రతను తగ్గించి చూపించే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
విజిలెన్స్ విభాగం ఏం చేస్తున్నట్టు?
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలు, అవకతవకలపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడం ఆనవాయితీ. రికార్డులు, లావాదేవీలు, అధికారుల వ్యవహారశైలిపై స్వతంత్రంగా విచారణ చేపట్టే అవకాశం విజిలెన్స్‌కు ఉంటుంది. అలాంటప్పుడు ఏనుమాముల మార్కెట్లోనూ ఆరోపణలు ఉన్నప్పటికీ మార్కెట్ శాఖకు చెందిన ఉద్యోగులతోనే రికార్డుల పరిశీలన చేయించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగానే మార్కెట్లో జరిగిన అక్రమాలను వెలికితీయడమే లక్ష్యమైతే విజిలెన్స్ విభాగంతో సమగ్ర తనిఖీలు ఎందుకు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపితే రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలు, వాస్తవ లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
విచారణా.. శిక్షణా?
తాజా పరిశీలనపై మార్కెటింగ్ శాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అధికారిక విచారణ అయితే ఏ అంశాలపై విచారణ చేపడుతున్నారు? ఏఏ సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తున్నారు? ఎంతకాలం లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు? ఇప్పటివరకు ఏమైనా అక్రమాలు గుర్తించారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. అదే సమయంలో ఇతర మార్కెట్ల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో భాగంగా రికార్డులను పరిశీలిస్తున్నట్లయితే ఆ విషయాన్ని కూడా స్పష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే ఏనుమాముల మార్కెట్లో గతంలో పత్తి కొనుగోళ్లు, సాగు విస్తీర్ణం తదితర అంశాలపై ఆరోపణలు, చర్యలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిశీలనపై సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఏనుమాముల మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న రికార్డుల పరిశీలన అసలు ఏ ఉద్దేశంతో జరుగుతోంది? అక్రమాలను వెలికితీయడానికా? లేక సాధారణ ప్రక్రియలో భాగంగానా? అన్నదానిపై మార్కెటింగ్ శాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆరోపణలు నిజమైతే సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే అనవసర అనుమానాలకు తావులేకుండా పరిశీలన ఉద్దేశాన్ని బహిర్గతం చేయాలని రైతులు, వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

