పెట్రోల్–గ్యాస్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
మార్జిన్ పెంచాలని కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
ఎనిమిదేళ్లుగా మారని కమీషన్.. పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడి
డీలర్ల సమస్యలపై మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సానుకూల స్పందన
కాకతీయ, ఖమ్మం బ్యూరో : దేశవ్యాప్తంగా పెట్రోలియం, డీజిల్, సహజవాయువు, ఎల్పీజీ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్ ఆవరణలో పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసి వినతిపత్రం అందజేశారు. డీలర్లకు చెల్లిస్తున్న మార్జిన్(కమీషన్)ను పెంచాలని యునైటెడ్ పెట్రోలియం డీలర్స్, ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తనతో పాటు స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరేను ఇటీవల కలిసి తమ సమస్యలను వివరించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా డీలర్లకు ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించిన మార్జిన్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. మారిన పరిస్థితులు, పెరిగిన నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని మార్జిన్‌ను పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

