శ్రావణంలోనైనా రాజన్న దర్శనం కల్పించండి
9నెలలుగా దర్శనానికి దూరమైన భక్తులు
శ్రావణమాసంలో ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
కాకతీయ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో తొమ్మిది నెలలుగా భక్తులకు దర్శనం పరిమితం చేయడం, నిలిపివేయడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. శ్రావణమాసంలోనైనా భక్తులందరికీ రాజన్న దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నెలల తరబడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇకపై జాప్యం చేయకుండా శ్రావణమాసంలోనే దర్శనానికి అవకాశం కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేయాలని కోరారు. అభివృద్ధి పనులకు భక్తులు సహకరిస్తారని, అయితే వాటి పేరుతో వారి ఆధ్యాత్మిక హక్కులు, మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు తక్షణ నిర్ణయం తీసుకోవాలని గోపి అన్నారు. శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదని, ఈ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్నను దర్శించుకోవాలని కోరుకుంటారని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవించి వెంటనే దర్శన ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

