తిరంగాతో హోరెత్తిన కరకగూడెం
నవోదయ విద్యార్థుల దేశభక్తి ర్యాలీ
కాకతీయ, కరకగూడెం: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కరకగూడెం మండలంలో జవహర్ నవోదయ విద్యార్థులు శుక్రవారం దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు కదం తొక్కడంతో కరకగూడెం పరిసరాలు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు జాతీయ జెండా ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చాటిచెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రత్తయ్య మాట్లాడుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. జాతీయ జెండా దేశ ప్రజల ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశం పట్ల బాధ్యత, గౌరవ భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

