ఇంటి నుంచే గ్యాస్ ఈ–కేవైసీ!
ఫోన్‌లోనే చేసుకునే అవకాశం
ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు
ఆధార్, రిజిస్టర్డ్ మొబైల్ ఉంటే చాలు
యాప్‌లో అథెంటికేషన్ పూర్తి చేస్తే సరి
డెలివరీ సిబ్బంది ద్వారా కూడా అవకాశం
పూర్తయిందో లేదో ముందే చూసుకోండి
కాకతీయ,స్పెషల్ డెస్క్ : ఇంటి నుంచే గ్యాస్ కనెక్షన్ ఈ–కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్, గ్యాస్ కనెక్షన్‌కు నమోదైన మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు ఉంటే ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు తమ సంస్థల అధికారిక యాప్‌ల ద్వారా ఆధార్ ఆధారిత అథెంటికేషన్ చేసుకునే వీలుంది. ఇప్పటికే ఈ–కేవైసీ పూర్తి చేసిన వారు మరోసారి చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్ కనెక్షన్‌కు ఈ–కేవైసీ చేయించుకోవడానికి ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. అయితే ప్రారంభించే ముందు గ్యాస్ కనెక్షన్ వివరాలు, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. కనెక్షన్‌కు ఏ మొబైల్ నంబర్ నమోదై ఉందో కూడా ముందుగా నిర్ధారించుకోవాలి. ఆధార్ అథెంటికేషన్ సమయంలో ఓటీపీ అవసరమైతే రిజిస్టర్డ్ నంబర్‌కే అది వస్తుంది.
అధికారిక యాప్‌నే ఎంచుకోండి
మీరు వినియోగిస్తున్న గ్యాస్ కంపెనీ అధికారిక యాప్‌ను మాత్రమే ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇండేన్ వినియోగదారులు ఇండియన్‌ఆయిల్ వన్, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు హెచ్‌పీ పే యాప్‌లను ఉపయోగించవచ్చు. యాప్‌లను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడం సురక్షితం. యాప్‌ను తెరిచి గ్యాస్ కనెక్షన్‌కు నమోదైన మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ధ్రువీకరణ పూర్తి చేయాలి. అనంతరం సంబంధిత గ్యాస్ కనెక్షన్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. యాప్‌లోని ప్రొఫైల్ లేదా కస్టమర్ వివరాల విభాగంలో ఈ–కేవైసీ లేదా ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ సూచించిన విధంగా ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియను ప్రారంభించాలి. అందుబాటులో ఉన్న విధానాన్ని బట్టి ఓటీపీ, ముఖ గుర్తింపు లేదా బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది.
స్టేటస్ తప్పక పరిశీలించాలి
అథెంటికేషన్ విజయవంతమైన తర్వాత యాప్‌లో కేవైసీ స్థితిని పరిశీలించాలి. కేవైసీ పూర్తయినట్లు స్టేటస్ కనిపిస్తే ప్రక్రియ ముగిసినట్టే. స్టేటస్ కనిపించకపోతే వెంటనే మళ్లీ ప్రయత్నించకుండా ముందుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం మంచిది. ఆన్‌లైన్‌లో ఈ–కేవైసీ పూర్తి చేయడం సాధ్యం కాకపోతే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న అధికారిక యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
నకిలీ లింక్‌లతో జాగ్రత్త
ఈ–కేవైసీ పేరుతో వచ్చే గుర్తుతెలియని లింక్‌లు, ఏపీకే ఫైళ్లు, అనధికారిక యాప్‌లను ఉపయోగించకూడదు. గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ లేదా సంబంధిత ఏజెన్సీ ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలి. ఎవరైనా ఫోన్ చేసి యూపీఐ పిన్, బ్యాంకు పాస్‌వర్డ్ వంటి రహస్య వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ముఖ్యంగా అందరు వినియోగదారులు మళ్లీ కొత్తగా ఈ–కేవైసీ చేయాల్సిందేనన్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కేంద్రం 2026 మార్చిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు, ఇంకా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయని వారు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ–కేవైసీ పూర్తయిన వారు మరోసారి చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

