ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ?
చేయూత పథకం కింద 2.50 లక్షల మందికి లబ్ధి
తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు తొలిసారి పెన్షన్లు
హైదరాబాద్లో సీఎం ప్రారంభం.. జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా పంపిణీ
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి చేయూత పథకం కింద దాదాపు 2.50 లక్షల కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వివిధ సామాజిక వర్గాలకు అందిస్తున్న పెన్షన్లతో పాటు ఈసారి కొత్తగా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులను కూడా పథకంలో చేర్చనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభించనుంది. కొత్త పెన్షన్ల పంపిణీపై ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి ప్రాథమిక స్థాయిలో సమాచారం చేరినట్లు తెలిసింది. లబ్ధిదారుల జాబితాల ఖరారు, ప్రొసీడింగ్స్ సిద్ధం చేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి వెలువడాల్సి ఉంది.

