epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది
బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌
అన్న ప్రణయ్‌భాస్కర్‌ రాజకీయాల్లో.. నేను తెరవెనుక
ఓటములు ఎన్నైనా.. ఎమ్మెల్యే కావాలన్న పట్టుదల వీడలేదు
కేసీఆర్‌తో పరిచయం..నా జీవితంలో అత్యంత కీల‌క‌మైన మ‌లుపు
ఆర్థిక సంబంధాలతో కాదు.. మానవ సంబంధాలతో గెలిచా
2029లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా..!

‘‘రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మంచి బిజినెస్‌మెన్‌గా ఎదగాలనుకున్నా. అన్నయ్య ప్రణయ్‌భాస్కర్‌ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకు తెరవెనుక నుంచి సహకరించేవాడిని. కానీ ఆయన మరణం తర్వాత హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్టర్‌ వద్ద ఎదురైన అవమానం నా జీవితాన్నే మార్చేసింది. ‘పదవి లేకపోతే ఇంత అవమానమా?’ అన్న ఆలోచన నాలో కసిని పెంచింది. ఎమ్మెల్యే అయ్యాకే మళ్లీ అక్కడికి వస్తానని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆ తర్వాత ఓటములు వచ్చాయి.. అడ్డంకులు ఎదురయ్యాయి.. అయినా వెనక్కి తగ్గలేదు. ప్రజలను, కార్యకర్తలను, కార్మికులను నమ్ముకున్నా. చివరకు ఎమ్మెల్యే అయ్యా. ఇప్పుడు కూడా నేను సీరియస్‌ పొలిటికల్‌ లీడర్‌నే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. ఖచ్చితంగా గెలుస్తా’’ అని మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్‌విప్‌, బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. తన బాల్యం నుంచి వ్యాపారంపై ఉన్న ఆసక్తి, అన్న ప్రణయ్‌భాస్కర్‌తో అనుబంధం, తనను రాజకీయాల్లోకి నడిపించిన ఆ ఒక్క ఘటన, వరుస ఓటములు, కేసీఆర్‌తో పరిచయం, టీఆర్‌ఎస్‌తో ప్రయాణం, ప్రజలు–కార్మిక సంఘాలతో ఏర్పడిన మానవ సంబంధాలు, ఉద్యమకారులకు చేసిన సాయం, కల్పలత సూపర్‌బజార్‌తో అనుబంధం, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరి, కుటుంబ జీవితం, భవిష్యత్‌ రాజకీయ లక్ష్యాల వరకు ఇంతకుముందు పెద్దగా బయటకు చెప్పని అనేక విషయాలను డిజిటల్‌ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పంచుకున్నారు.ఆ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే..!

బిజినెస్ మెన్ కావాల‌ని క‌ల‌గ‌న్నాను..!

‘‘మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. మా నాన్న విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేసేవారు. అన్నలు, అక్కలు, తమ్ముళ్లతో కలిసి వడ్డేపల్లిలో పెరిగాను. చిన్నతనంలో ఇంట్లో ఎప్పుడూ సందడిగానే ఉండేది. కుటుంబంలో విలువలు, సంప్రదాయాలతో పెరిగాం. రాజకీయాలంటే ఆసక్తి ఉన్నా.. నాయకుడిని కావాలనే ఆలోచన మాత్రం లేదు. మంచి వ్యాపారవేత్తగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అందుకే టెంట్‌హౌస్‌ నిర్వహించాను. పలు ఏజెన్సీలు తీసుకున్నాను. అప్పట్లో ఇప్పటిలా ఆన్‌లైన్‌ వ్యాపారాలు లేవు. ఏజెన్సీల ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా. మా అన్న ప్రణయ్‌భాస్కర్‌ మాత్రం రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. నేను ఆయనకు తెరవెనుక నుంచి సహకరించేవాడిని. 1984లో అన్నయ్య ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజలతో సంబంధాలు పెంచుకునేందుకు పలు సంఘాలను ఏర్పాటు చేశాం. 1994లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఆయన అకాల మరణంతో మా కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయినా నాకు రాజకీయాలపై ఆసక్తి రాలేదు. కుటుంబం, వ్యాపారంపైనే దృష్టి పెట్టాలనుకున్నా.’’

ఆ అవమానమే నాలో కసి రేపింది

‘‘అన్నయ్య మరణం తర్వాత వదిన, పిల్లల భవిష్యత్తు కోసం అమ్మానాన్నలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లాను. అన్నయ్యకు కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్‌కు వెళ్లాం. అక్కడికి వెళ్లేసరికి గదికి సీల్‌ వేసి ఉంది. ఆ విషయం తెలుసుకునేందుకు క్వార్టర్‌ నిర్వహణ అధికారులను సంప్రదించాను. ఎస్టేట్ ఆఫీస‌ర్ (ఈవో)
వ‌ద్ద‌కు వెళ్లి వివ‌ర‌ణ అడిగే ప్ర‌య‌త్నం చేసినప్పుడు ‘మీరు ఓడిపోయారు కదా’ అంటూ అవ‌మాన‌కరంగా, చాలా నిర్ల‌క్ష్యంగా మాట్లాడారు. ఆయ‌న అన్న మాట‌ల‌ను నన్ను తీవ్రంగా కలచివేశాయి. ‘పదవి లేకపోతే ఇంత అవమానమా?’ అని అనిపించింది. అదే సమయంలో ఎమ్మెల్యే కావాలనే కసి నాలో మొదలైంది. ఎమ్మెల్యే అయ్యాకే మళ్లీ ఈ ఎస్టేట్‌లో అడుగుపెడుతాన‌ని అని అనుకున్నాను. ఆ రోజు జరిగిన ఘటనే నా జీవితానికి మలుపు. కాలం చ‌క్రం గిర్రున తిరిగింది.. 2009లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్ప‌టికీ రిటైర్డ్ అయిన స‌ద‌రు అధికారి ఇంటికి స్వ‌యంగా వెళ్లాను. ఆయనను పలకరించి శాలువా కప్పి, స్వీటు ఇచ్చి వచ్చాను. నన్ను అవమానించిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం కాదు.. నేను అనుకున్నది సాధించానని చూపించడమే నాకు ముఖ్యం.’’

ఓటములు వచ్చాయి.. కానీ నా పట్టుదల తగ్గలేదు

‘‘1999లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. 35 వేల ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి మద్దతు లభించింది. అయినా ఓడిపోయాను. 2004లో మాత్రం ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకున్నా. అప్పట్లో టీడీపీ–బీజేపీ పొత్తు కారణంగా నా స్థానాన్ని త్యాగం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. నామినేటెడ్‌ పదవి ఇస్తామని చెప్పారు. నేను అంగీకరించలేదు. స్వతంత్రంగా పోటీ చేశాను. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కేసులు పెట్టారు. ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు. చివరకు కేవలం 1,400 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆ ఓటమి కూడా నన్ను కుంగదీయలేదు. నా ధైర్యం నా కార్యకర్తలు, ప్రజలే. వారిని నమ్ముకున్నా. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్య నుంచి మాత్రం బయటకు రాలేదు. అదే తర్వాత నా రాజకీయ ప్రయాణానికి బలమైంది.’’

2005లో కేసీఆర్‌తో పరిచయం.. టీఆర్‌ఎస్‌లోకి


‘‘తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో 2005లో కేసీఆర్‌ నన్ను హైదరాబాద్‌కు పిలిచారు. తనతో కలిసి రాజకీయ ప్రయాణం చేయాలని చెప్పారు. తొలుత కార్పొరేటర్‌గా పోటీ చేస్తే పట్టణ ప్రాంతంలోనూ బలం పెరుగుతుందని సూచించారు. 2004లో కేవ‌లం 1400 ఓట్ల తేడాతో ఓడిపోయిన న‌న్ను కార్పోరేట‌ర్‌గా పోటీ చేయ‌మ‌ని చెప్ప‌డం నాకు ఆశ్చ‌ర్యం, అస‌హ‌నం, అసంతృప్తి క‌లిగించాయి. కానీ కేసీఆర్ చెప్పిన మాట‌లు ఎందుక‌నో క‌న్విన్స్‌గా అనిపించాయి. చివ‌ర‌కు ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో నా కొత్త ప్రయాణం మొదలైంది. టౌన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేయూ జంక్షన్‌ సమీపంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాను. ఆ కార్యాలయాన్ని కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నా. కానీ అప్ప‌టికే కొంత‌మంది నా గురించి ఆయనకు లేనిపోని విషయాలు చెప్పి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యాల‌య‌మే భూ క‌బ్జా అంటూ చెప్పిన‌ట్లు తెలిసింది. అయినా నేను స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించాను. పార్టీ కార్యాలయం కోసం నేను పడిన కష్టాన్ని వివరించాను. కార్యాల‌యం ఓన‌ర్‌ను స్వ‌యంగా ప‌రిచ‌యం చేయ‌డంతో నాపై చెప్పిన మాట‌ల‌న్నీకూడా అబ‌ద్ధాల‌ని తేలిపోవ‌డంతో ఆయ‌న వ‌రంగ‌ల్‌కు వ‌చ్చి కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో పార్టీ కోసం నేను చేసిన పని, ప్రజల్లో నాకు ఉన్న సంబంధాలు, కార్యకర్తలతో నా అనుబంధాన్ని కేసీఆర్‌ గమనించారు. అక్కడే నాకు పార్టీ టికెట్‌ ఖరారైంది. ఆ పరిచయం నా రాజకీయ జీవితంలో మరో కీలక మలుపు.’’

‘‘డబ్బుతో కాదు.. మనుషులతో గెలిచా’’

‘‘2004లో ఓడిపోయిన తర్వాత నేను డబ్బు, ఆర్థిక వనరులపై ఆధారపడలేదు. ప్రజలు, కార్మికులు, వివిధ సంఘాలతో సంబంధాలను పెంచుకున్నా. మంగలి, ఆటో, ఎల్‌ఐసీ తదితర సంఘాలతో నాకు అనుబంధం ఏర్పడింది. 44 కార్మిక సంఘాలతో ఐక్యవేదిక ఏర్పాటు చేసి వారి సమస్యల్లో భాగస్వామినయ్యా. అందుకే నేను ఒక విషయం స్పష్టంగా చెబుతా.. నేను ఆర్థిక సంబంధాలతో కాదు.. మానవ సంబంధాలతో గెలిచా. పేదలు, బలహీన వర్గాలు నన్ను ప్రేమగా ‘దాస్యం అన్నా’ అని పిలవడం అనేది అన్ని ప‌ద‌వుల క‌న్నా మిన్నా అనిపిస్తుంది..నాకు ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. కార్యకర్తలు, ప్రజలు నన్ను తమ మనిషిగా భావించడం వల్లే ఎన్నో ఎన్నికల్లో నాకు అండగా నిలిచారు. నా రాజకీయ జీవితంలో కొన్ని సూత్రాలు పెట్టుకున్నా. కార్యకర్తలకు ఆరోగ్య సమస్య వస్తే అర్ధరాత్రైనా స్పందించాలి. ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలి. పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయాలి. కార్యకర్తలను కష్టకాలంలో వదిలిపెట్టకూడదు. కార్మిక, సహకార సంఘాల సమస్యల్లో భాగస్వామి కావాలి. ఇవే నా రాజకీయ బలానికి కారణం.’’

సాయం చేశా.. ప్రచారం మాత్రం చేసుకోను
‘‘తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి పనిచేసిన ఉద్యమకారులకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అండగా నిలిచా. కేసుల పాలైనవారికి, గాయపడినవారికి, ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సాయం చేశా. రైల్వే కేసులతో ఇబ్బందులు పడిన వారికి కూడా ఆర్థికంగా అండగా నిలిచా. కానీ నేను చేసిన సాయాన్ని ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పేది. ‘దానం గుప్తంగానే ఉండాలి. కుడిచేతితో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు’ అనేది. ఆ మాటను ఇప్పటికీ పాటిస్తున్నా. ఎవరికైనా సాయం చేసిన తర్వాత దాన్ని బయట చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. సాయం పొందిన వ్యక్తి మనసులో నేను ఉంటే చాలు.’’

కల్పలతతో చిన్ననాటి నుంచే అనుబంధం

‘‘వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఎదురుగా ఉన్న కల్పలత సూపర్‌బజార్‌తో నాకు చిన్ననాటి నుంచే అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని మూసివేసే ప్రయత్నాలు జరిగినప్పుడు అడ్డుకున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత కల్పలతపై ఉన్న అప్పులను మాఫీ చేయించడంతోపాటు సభ్యత్వాలను పెంచి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నాం. పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశాం. దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా లాటరీల ద్వారా బహుమతులు అందించాం. సంస్థను నిలబెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు కల్పలతలో అవినీతి జరిగిందని, అందుకు నేనే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు. సంస్థ కోసం నేను చేసిన ప్రయత్నాలు అక్కడి వారికి తెలుసు.’’

రాజకీయాల్లో కక్ష సాధింపులకు దూరం

‘‘నా రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటా. వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం నా పద్ధతి కాదు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగను. కరోనా సమయంలో నేను అధికార పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ భేదాలు చూడకుండా కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లకు వెళ్లి మందులు, ఇంజెక్షన్లు అందించిన సందర్భాలు ఉన్నాయి. మనిషికి అవసరం ఉన్నప్పుడు అండగా నిలవాలనేదే నా ఆలోచన. అయితే నా మీద చాలా ఆరోపణలు చేశారు. భూకబ్జాలకు పాల్పడ్డానన్నారు. స్విస్‌ బ్యాంకులో రూ.2 వేల కోట్లు దాచుకున్నానన్నారు. అవి నిజమైతే నిరూపించాలి. ఆరోపణలు చేయడం సులభం. నిరూపించడం ముఖ్యం. రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎదుర్కోవచ్చు.. కానీ వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం నా విధానం కాదు.’’

ప్రశాంతతకు మెడిటేషన్‌

‘‘నా కుటుంబం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే ఉంది. నా శ్రీమతి నాకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కుటుంబం నా వెంట నిలిచింది. ప్రస్తుతం ఆధ్యాత్మికతపై కూడా ఆసక్తి పెరిగింది. మెడిటేషన్‌ చేస్తున్నా. రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మెడిటేషన్‌ ఉపయోగపడుతోంది. మనం ఎంత ఎత్తుకు వెళ్లినా కుటుంబం, మనుషులతో ఉన్న సంబంధాలను మర్చిపోకూడదు.’’

2029లో ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఇస్తా

‘‘నా రాజకీయ జీవితంలో ఎదురైన ఓటముల నుంచి చాలా నేర్చుకున్నా. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించా. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా. ఓటమి నన్ను ఆపలేదు.. మరింత బలంగా చేసింది. నేను సీరియస్‌ పొలిటికల్‌ లీడర్‌ను. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఖచ్చితంగా గెలుస్తా. ప్రజలు, కార్యకర్తలతో ఉన్న అనుబంధమే నా బలం. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజునుంచి ప్రజలతోనే ఉన్నా. 2029లో నా ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది. అది చిల్లర రాజకీయాలతో కాదు.. నా పనితీరుతో ఉంటుంది. నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఒక అవమానం కావచ్చు. కానీ నన్ను నిలబెట్టింది మాత్రం ప్రజలు, కార్యకర్తలు, మానవ సంబంధాలే. ఇక ముందు కూడా అదే బలంతో ముందుకు వెళ్తా.’’

-అరెల్లి కిర‌ణ్ గౌడ్‌
– 7396604266

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం! ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం లౌకిక...

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌ ఉన్న‌త విద్యావంతుడు పార్టీలోకి...

ప‌ల్లె పోరు షూరు

ప‌ల్లె పోరు షూరు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ వేఢీ ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో 1224...

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై పోరుబాట వచ్చే నెల...

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవు గ‌తంలో డిపాజిట్లు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.