ఆర్టీఏలో డ్రైవర్లే దందాకు అండ..?
ఆ వాహనాలు అధికారులవేనా?
టెంపరరీ నంబర్లతో తిరుగుతున్న వాహనాలపై ప్రశ్నలు
ప్రైవేటు వ్యక్తులే అధికారుల వెంట.. ఏఎంవీఐ డ్రైవర్ చుట్టూ వసూళ్ల వ్యవహారం
ఇద్దరు ఏఎంవీఐలు ఉండగా మరో ఎంవీఐకి ఓడీ ఎందుకు?
లాగిన్ లొల్లి.. వాహనాల వ్యవహారంపైనా ప్రశ్నల వర్షం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణాశాఖలో వ్యవహారాలు వరుసగా చర్చనీయాంశమవుతున్నాయి. విధుల్లో లేని అధికారి అధికారిక లాగిన్, డిజిటల్ సంతకంతో ధ్రువపత్రాలు జారీ చేసిన వ్యవహారం తర్వాత ఇప్పుడు వాహన తనిఖీలకు వినియోగిస్తున్న వాహనాలు, వాటి నంబర్ ప్లేట్లు, అధికారుల వెంట తిరుగుతున్న ప్రైవేటు వ్యక్తుల పాత్ర, ఓడీపై వచ్చిన అదనపు అధికారి వ్యవహారాలు ప్రశ్నలకు దారితీస్తున్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన వాహనాలు టెంపరరీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న పరిస్థితి ఉంటే వాటి యాజమాన్యం, వినియోగం, శాఖకు కేటాయింపు వివరాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అధికారిక విధుల్లో ప్రైవేటు వ్యక్తులు పాల్గొంటున్నట్లయితే వారికి ఆ అవకాశం ఎవరు కల్పించారు? వారి బాధ్యత ఏమిటి? అన్నది కూడా స్పష్టం కావాల్సి ఉంది.
ఆ వాహనాలు అధికారులవేనా?
రవాణాశాఖ అధికారులు తనిఖీలకు వెళ్లేందుకు వాహనాలను వినియోగిస్తారు. అయితే ములుగులో తనిఖీలకు ఉపయోగిస్తున్న కొన్ని వాహనాలకు సంబంధించి టెంపరరీ నంబర్ ప్లేట్లు కనిపిస్తున్న వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారింది. వాహనాలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నవైతే శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ స్థానంలో టెంపరరీ నంబర్ ఎందుకు కొనసాగుతోంది? ఆ వాహనాలు రవాణాశాఖకు అధికారికంగా కేటాయించినవేనా? లేక ప్రైవేటు వ్యక్తుల వాహనాలనా? శాఖ వినియోగానికి ప్రైవేటు వాహనాలు ఉపయోగిస్తే అందుకు అనుమతి ఉందా? వాటి వినియోగానికి సంబంధించిన బిల్లులు, లాగ్‌బుక్స్, ప్రయాణ వివరాలు ఉన్నాయా? అనే అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించాల్సి ఉంది.
డ్రైవర్లే కీలకమా?
వాహన తనిఖీల సమయంలో అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా తిరుగుతున్న వ్యవహారం ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశంగా మారింది. ములుగు జిల్లాలో ఇసుక క్వారీల నుంచి నిత్యం లారీలు రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ఒక్కో ఇసుక లారీ నుంచి నెలకు రూ.7,500 వరకు వసూళ్లు జరుగుతున్న వ్యవహారం చర్చలో ఉంది. ఇందులో ఒక ఏఎంవీఐకి సంబంధించిన ప్రైవేటు డ్రైవర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తనిఖీల సమయంలో జరిమానాలు, చెల్లింపులకు సంబంధించిన వ్యవహారాలను అతడే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. నగదు, డిజిటల్ లావాదేవీల రూపంలో జరిగే చెల్లింపులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ వ్యవహారంలో వాస్తవ పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.
కార్యాలయంలోనూ ప్రైవేటు వ్యక్తి పెత్తనమా?
ప్రైవేటు డ్రైవర్ కేవలం వాహనం నడపడానికే పరిమితం కాకుండా కార్యాలయ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తి కార్యాలయంలో అధికారిక వ్యవహారాల్లో పాల్గొనడానికి ఎవరు అనుమతించారు? రవాణాశాఖకు సంబంధించిన రికార్డులు, తనిఖీల సమాచారం, చలాన్ల వివరాలు అతడికి ఎలా అందుతున్నాయి? అధికారుల తరఫున ఏదైనా వ్యవహారం నిర్వహించే అధికారం అతడికి ఉందా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై కార్యాలయ సీసీ కెమెరాలు, డ్యూటీ రోస్టర్, తనిఖీ బృందాల వివరాలు పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి.
ఇద్దరు ఏఎంవీఐలు ఉండగా మరో ఎంవీఐ ఎందుకు?
ములుగు జిల్లాలో ఇప్పటికే ఒక ఎంవీఐ, ఇద్దరు ఏఎంవీఐలు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ మరో జిల్లాకు చెందిన ఏఎంవీఐ వినోద్‌రెడ్డిని ములుగుకు ఓడీపై విధులకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బంది సరిపోతున్న సమయంలో అదనంగా మరో అధికారిని ఓడీపై ఎందుకు తీసుకొచ్చారు? ఇసుక లారీలు, భారీ వాహనాల తనిఖీల కోసం ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఓడీ ఉత్తర్వులు ఎవరు జారీ చేశారు? ఎంతకాలానికి మంజూరు చేశారు? ఏ విధులు కేటాయించారు? అన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది.
లాగిన్ లొల్లి.. ఇప్పుడు వాహనాల వంతు!
ఇప్పటికే విధుల్లో లేని అధికారి లాగిన్, డిజిటల్ సంతకం వినియోగించి ధ్రువపత్రాలు జారీ చేసిన వ్యవహారం ములుగు రవాణాశాఖపై ప్రశ్నలు రేకెత్తించింది. తాజాగా టెంపరరీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలు, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం, డ్రైవర్ల పాత్ర, అదనపు అధికారిని ఓడీపై తీసుకురావడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు వాహనాల ఆర్‌సీలు, శాఖ కేటాయింపు పత్రాలు, లాగ్‌బుక్స్, సీసీ కెమెరా ఫుటేజీ, తనిఖీ రికార్డులు, చలాన్లు, ఓడీ ఉత్తర్వులు, లాగిన్ వివరాలు, సంబంధిత డిజిటల్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే శాఖపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

