దానం దారెటు..?
సుప్రీం తలుపు తట్టిన దానం నాగేందర్
కేవియట్ పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్, బీజేపీ
సుప్రీంలో ఊరట రాకుంటే ఖైరతాబాద్‌లో బైపోల్
ఉప ఎన్నికలో దానం బరిలో దిగుతారా.. లేక ఎమ్మెల్సీతో సర్దుకుంటారా..?!
దానం కాకుంటే ప్రత్యామ్నాయ అభ్యర్థిపై హైకమాండ్ కసరత్తు
అదే సమయంలో దానంకు ఎమ్మెల్సీపై కాంగ్రెస్‌లో చర్చ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నియోజకవర్గం ఖాళీ అయింది. దీంతో తాజా ఎన్నికకు మార్గం సుగమమైంది. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. బీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంలో హైకోర్టు తీర్పుపై ఊరట లభించకపోతే ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని దానం అనర్హత కోరుతూ బీజేపీ నేత అలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు కూడా ప్రకటించింది.
సుప్రీంలో దానం.. కేవియట్‌తో బీఆర్‌ఎస్, బీజేపీ
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల్లోనే తేల్చుకుంటానని దానం నాగేందర్ ప్రకటించినప్పటికీ.. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు దానం పిటిషన్‌పై తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ బీఆర్‌ఎస్, బీజేపీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో సోమవారం విచారణకు వస్తుందా? వస్తే సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుపై ఊరట లభించకపోతే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్‌లో అసలు చర్చ దానం నాగేందర్ మళ్లీ పోటీ చేస్తారా? లేదా? అన్నదానిపైనే సాగుతోంది. మొదట ఉప ఎన్నిక వస్తే తానే పోటీ చేస్తానని దానం చెప్పినప్పటికీ.. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై రోజుకో ప్రచారం వినిపిస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పదవి వైపు ఆయన దృష్టి మళ్లిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో కొత్తగా మొదలైంది.
ఎమ్మెల్సీ.. మంత్రి పదవి ఫార్ములా?
ఉప ఎన్నికలో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతోపాటు మంత్రి పదవి ఇవ్వాలని దానం నాగేందర్ అధిష్ఠానం వద్ద కోరుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే మంత్రి పదవిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని దానం తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవి విషయంలో ప్రస్తుత పరిస్థితులు మారడంతో.. ఎమ్మెల్సీ మార్గంలో మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఫార్ములా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దానం నాగేందర్‌కు మంత్రి పదవి ఇస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ రాజకీయంగా ప్రయోజనం పొందుతుందనే చర్చ పార్టీ పెద్దల్లో జరుగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి బలమైన ఫలితాలు సాధించేందుకు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తానని దానం హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాతినిధ్యంతోపాటు మున్నూరు కాపు సామాజిక సమీకరణాన్ని కూడా ఈ నియామకం ద్వారా పరిగణనలోకి తీసుకోవచ్చనే ఆలోచన పార్టీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక నిర్ణయం వెలువడలేదు.
దానం కాకుంటే ఎవరు?
ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యే పరిస్థితి వస్తే దానం నాగేందర్ అభ్యర్థిత్వంపైనే కాంగ్రెస్ ముందుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన బరిలో దిగితే స్థానికంగా ఆయన బలాబలాలు, కాంగ్రెస్ సంస్థాగత పరిస్థితి, బీఆర్‌ఎస్–బీజేపీ అభ్యర్థుల ప్రభావం వంటి అంశాలపై ఇప్పటికే పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దానం కాకుండా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేయాలి? ఆ అభ్యర్థికి నియోజకవర్గంలో ఉన్న బలం ఎంత? అన్న అంశాలపై కూడా హైకమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవల్‌లో ఎంత బలంగా ఉంది? స్థానిక నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది? బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఎలాంటి పోటీ ఉంటుంది? అనే అంశాలపై స్థానికంగా అంచనాలు సేకరించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
బీఆర్‌ఎస్.. బీజేపీ గురి ఖైరతాబాద్‌పైనే
హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ కావడంతో బీఆర్‌ఎస్, బీజేపీ కూడా ఉప ఎన్నికపై దృష్టి సారిస్తున్నాయి. దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి అనంతరం కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని రెండు పార్టీలు ప్రధాన ప్రచారాంశంగా చేసుకునే అవకాశం ఉంది. దీంతో దానం పోటీ చేస్తారా? కొత్త అభ్యర్థిని కాంగ్రెస్ ఎంపిక చేస్తుందా? అన్నది కేవలం అభ్యర్థి ఎంపిక కాకుండా ఆ పార్టీ తదుపరి రాజకీయ వ్యూహానికి సంబంధించిన అంశంగా మారింది. ఒకవైపు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం.. మరోవైపు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు రాజకీయ కసరత్తు.. ఇంకోవైపు ఎమ్మెల్సీ–మంత్రి పదవిపై చర్చ. దానం నాగేందర్ చుట్టూ ఇప్పుడు మూడు రాజకీయ మార్గాలు చర్చకు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? హైకోర్టు తీర్పు అమల్లోకి వస్తుందా? ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ దానాన్నే మళ్లీ బరిలోకి దింపుతుందా? లేక కొత్త ముఖాన్ని తెస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం న్యాయపరమైన తదుపరి పరిణామాల తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

