వనమా ఇంట్లో వారసత్వ వార్!
కూతురి కోసం రాఘవ పట్టు.. మనవడి కోసం తాత ఆలోచన
రాజకీయ వారసత్వంపై తండ్రీకొడుకుల మధ్య విభేదాలు
అలేఖ్యను రాజకీయాల్లోకి తేవాలని రాఘవ ఒత్తిడి
సాయినాథ్‌ను రంగంలోకి దించాలని మాజీ ఎమ్మెల్యే వనమా యోచన
సస్పెన్షన్ తొలగక రాఘవలో అసంతృప్తి
వద్దిరాజు మన అభ్యర్థి అంటూ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ముదిరిన వ్యవహారం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుటుంబంలో రాజకీయ వారసత్వ వ్యవహారం చిచ్చు రేపుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కూతురు అలేఖ్యను రాజకీయ వారసురాలిగా రంగంలోకి దించాలని వనమా రాఘవ పట్టుబడుతుండగా, తన రెండో కొడుకు రామకృష్ణ కుమారుడైన సాయినాథ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని వనమా వెంకటేశ్వరరావు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంట్లో రాజకీయంగా తన మాటే చెల్లుబాటు కావాలన్న రాఘవ వైఖరికి, మనవడిపై మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఉన్న మమకారానికి మధ్య విభేదాలు పెరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి రాఘవ సస్పెన్షన్‌కు గురికావడం, అది తొలగకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. వనమా కుటుంబానికి నియోజకవర్గ రాజకీయాల్లో సుదీర్ఘ అనుబంధం ఉండటంతో తదుపరి రాజకీయ వారసుడెవరన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.
వంటావార్పు వేదికగా కీలక వ్యాఖ్యలు
ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుటుంబ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాత తండ్రి వైఖరిపై రాఘవ అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గ రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం తగ్గే పరిస్థితులు ఏర్పడుతున్నాయనే భావన కూడా ఆయనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి రాఘవపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. అది తొలగకపోవడంతో తన రాజకీయ భవిష్యత్‌పై రాఘవ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. సస్పెన్షన్ తొలగించేందుకు వద్దిరాజు రవిచంద్ర పలుమార్లు పార్టీ అగ్రనేతల వద్ద రాఘవ అంశాన్ని ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, రాఘవపై పార్టీ అగ్రనాయకత్వంలో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీకి చెప్పి రాఘవ సేవలను వినియోగించుకున్నట్లు కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కుర్చీలు విరగ్గొట్టిన ఘటనతో ఆగ్రహం
సస్పెన్షన్ తొలగే వరకు వేచి ఉండకుండా రాఘవ మళ్లీ తన పాత పంథాలోనే వ్యవహరిస్తున్నారన్న చర్చ బీఆర్ఎస్లో మొదలైంది. కేసీఆర్ దూత తక్కెళ్లపల్లి రవీందర్రావు సమక్షంలో రాఘవ అనుచరులు కుర్చీలు విరగ్గొట్టిన ఘటన పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత రాఘవతో ఎలాంటి పార్టీ సేవలు వినియోగించవద్దని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి రాఘవలో అసంతృప్తి మరింత పెరిగినట్లు సమాచారం. నియోజకవర్గంపై తన రాజకీయ పెత్తనం పోతుందనే ఆందోళనతోనే రాఘవ పార్టీ లోపల కొత్త గందరగోళానికి తెరలేపుతున్నారన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది. ఒకవైపు సస్పెన్షన్ కొనసాగుతుండటం, మరోవైపు పార్టీ నాయకత్వం ఇతర నాయకులకు ప్రాధాన్యం ఇస్తుండటం రాఘవకు ఇబ్బందికరంగా మారినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా వనమా కుటుంబ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటే పార్టీ అగ్రనేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి.
వద్దిరాజు ప్రయత్నాలకు బ్రేక్?
వంటావార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యల తర్వాత రాఘవ తండ్రిపైనే తిరగబడ్డారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఇంట్లో పని వాళ్ల సమక్షంలో తండ్రిపై తీవ్ర పదజాలంతో మాట్లాడినట్లు సమాచారం. రాజకీయాల్లోనూ ఇదే దూకుడు వైఖరితో రాఘవ గతంలో నష్టపోయారని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కుటుంబం నుంచి గానీ, పార్టీ నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. రాఘవ సస్పెన్షన్ తొలగించేందుకు వద్దిరాజు రవిచంద్ర చేసిన ప్రయత్నాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పలుమార్లు పార్టీ అగ్రనేతల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి రాఘవపై ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పార్టీకి చెప్పి రాఘవ సేవలను వినియోగించుకున్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ సస్పెన్షన్ తొలగకపోవడంతో రాఘవ అసంతృప్తి మరింత పెరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాఘవ అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్న అసంతృప్తి బీఆర్ఎస్ ఉద్యమకారులు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలను వ్యక్తిగత రాజకీయ ప్రచారంతో అయోమయానికి గురిచేయడం సరికాదని వారు అంటున్నారు. కుటుంబ వారసత్వంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే పార్టీ పెద్దలతో చర్చించి స్పష్టతకు రావాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత వర్గాల ఏర్పాటు, సోషల్ మీడియా ప్రచారంతో పార్టీకి నష్టం కలగకుండా నాయకత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
ఎవరి వారసత్వం.. ఎటువైపు రాజకీయం?
ప్రస్తుతం వనమా కుటుంబంలో ప్రధాన ప్రశ్న రాజకీయ వారసత్వం ఎవరికి దక్కుతుందన్నదే. అలేఖ్యను ముందుకు తీసుకురావాలన్న రాఘవ పట్టుదల ఒకవైపు, సాయినాథ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆలోచన మరోవైపు కొనసాగుతున్నాయి. దీనికి తోడు రాఘవ సస్పెన్షన్, దాన్ని తొలగించేందుకు జరిగిన ప్రయత్నాలు, వంటావార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు వనమా కుటుంబ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ విభేదాలకు పార్టీ నాయకత్వం ఎలా ముగింపు పలుకుతుందన్నదే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

