ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య
గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి
ఎంజీఎం నుంచి ఏకశిల ఆసుపత్రికి తరలింపు
గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్
కాకతీయ, గీసుగొండ : ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురైన రైతు గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వంచనగిరిలో చోటుచేసుకుంది. సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. వంచనగిరికి చెందిన ఎడ్డె రవికుమార్ (42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న ఉదయం 10.30 గంటల సమయంలో గ్రామంలోని బతుకమ్మ గడ్డ సమీపంలో పారాక్వాట్ గడ్డిమందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఏకశిల ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11 గంటల సమయంలో రవికుమార్ మృతి చెందాడు.
తన భర్త మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఎడ్డె సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపారు.

