వామ్మో..!మండి బజార్‌లో బిర్యానీ
మూడు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
సింథటిక్ రంగులు, టేస్టింగ్ సాల్ట్, ఫ్రోజెన్ చికెన్ గుర్తింపు
వంట గదుల్లో బొద్దింకలు.. పరిసరాల్లో సాలెగూళ్లు
లైసెన్సులు, వైద్య ధ్రువపత్రాలు లేకుండానే నిర్వహణ
రూ.23,468 విలువైన పదార్థాలు స్వాధీనం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ మండి బజార్‌లోని హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం మట్టెవాడ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. జాఫ్రాన్ బిర్యానీ హోటల్, కుర్షీద్ బిర్యానీ హోటల్, గ్రీన్ పార్క్ హోటళ్లలో తనిఖీ చేయగా అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. మూడు హోటళ్లలోనూ నేలలు, గోడలు శుభ్రంగా లేకపోవడం, ఆహార పదార్థాలను కప్పకుండా నిల్వ చేయడం గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్లు, ఫ్రోజెన్ చికెన్, సగం ఉడికించిన చికెన్ లభించాయి. వంట గదుల్లో బొద్దింకలు, పరిసరాల్లో సాలెగూళ్లు కనిపించాయి. గ్రీన్ పార్క్ హోటల్‌లో రూ.23,468 విలువైన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్ 16 ప్యాకెట్లు (రూ.1,248), టేస్టింగ్ సాల్ట్ 48 ప్యాకెట్లు (రూ.7,920), ఫ్రోజెన్ చికెన్ 20 కిలోలు (రూ.6,000), చికెన్ కబాబ్ 10 కిలోలు (రూ.3,000), పనీర్ 5 కిలోలు (రూ.5,000), జింజర్ పేస్ట్ కిలో (రూ.300) ఉన్నాయి.

మూడు హోటళ్లలోనూ 12 చొప్పున ఉల్లంఘనలు
మూడు హోటళ్లలోనూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు ప్రదర్శించకపోవడంతోపాటు ఆహార నిర్వహణ సిబ్బందికి వైద్య ఆరోగ్య ధ్రువపత్రాలు, పెస్ట్ కంట్రోల్ సర్టిఫికెట్లు, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు లేవని అధికారులు గుర్తించారు. ఒక్కో హోటల్‌లో 12 చొప్పున నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలిపారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం జాఫ్రాన్ యజమాని మహ్మద్ ఖిల్లాద్ బేగ్, కుర్షీద్ యజమాని కుర్షీద్, గ్రీన్ పార్క్ యజమాని మహ్మద్ అబ్దుల్ వాసిఫ్‌లపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు. దాడుల్లో ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్లు జి. సుబ్బారెడ్డి, కె. శ్రీధర్, బి. రాజగోపాల్, బండారి రాజు, ఎస్‌ఐలు బి. ఉప్పలయ్య, కె. సుధాకర్ పాల్గొన్నారు.


