ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ
కాకతీయ, ఇనుగుర్తి : ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో జనహృదయాల్లో నిలిచిన ప్రజాకవి, గేయరచయిత అందెశ్రీ తొలి వర్ధంతిని ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి వైభవాన్ని తన గీతాలతో ప్రపంచానికి చాటిన సాహిత్య శిఖరం అందెశ్రీ అని కొనియాడారు. ఆయన రాసిన ప్రతి అక్షరం సామాజిక సందేశాన్ని అందించిందని, ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ వంటి పాటలు సమాజంలో కనుమరుగవుతున్న మానవత్వాన్ని ప్రతిబింబించాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమానికి ఊపిరిపోశారని అన్నారు. భౌతికంగా దూరమైనా ఆయన సాహిత్యం ప్రజల్లో నిరంతరం స్ఫూర్తిని నింపుతుందని పేర్కొంటూ అక్షర నీరాజనం అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

