సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రేవూరి
కొనాయిమాకులలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
కాకతీయ, గీసుగొండ : అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం గీసుగొండ మండలం కొనాయిమాకులలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
అనంతరం రైతు వేదికలో గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లతో పాటు గీసుగొండ మండలానికి చెందిన అర్హులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. పరకాల నియోజకవర్గంలో ఇప్పటివరకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 3,186 మందికి రూ.32.89 కోట్లకు పైగా, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 3,505 మందికి రూ.12.06 కోట్లకు పైగా, ఎల్‌ఓసీ ద్వారా 226 మందికి రూ.4.74 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.
అర్హులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని రేవూరి తెలిపారు. ఇందిరా మహిళా డెయిరీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్, సన్నబియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్, పంచాయతీరాజ్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ అనిల్, ఏపీవో చంద్రకాంత్, స్థానిక సర్పంచ్ వజ్ర రాజు, ఇతర గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

