యూపీఐపై ఎండీఆర్ భారం
లావాదేవీలపై ప్రభావం స్వల్పమే
రూ.2 వేలపైనే ఎండీఆర్.. 96 శాతం లావాదేవీలకు మినహాయింపు
మొత్తం విలువలో 10 శాతానికే ఛార్జీల ప్రభావం
రూ.75 వేల లావాదేవీపై గరిష్ఠంగా రూ.300
రూ.1,000 కోట్ల టర్నోవర్ వ్యాపారాల నుంచే 80 శాతం వసూళ్లు
ఎండీఆర్‌లో 5 శాతం ప్రత్యేక నిధికి మళ్లింపు
ఎన్పీసీఐ సీఈఓ దిలీప్ ఆస్బే
కాకతీయ, హైదరాబాద్ : యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వల్ల లావాదేవీల పరిమాణం, విలువపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సీఈఓ దిలీప్ ఆస్బే తెలిపారు. మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో కేవలం 10 శాతం మేరకే ఎండీఆర్ ఛార్జీల ప్రభావం ఉండొచ్చన్నారు. కొత్త విధానం ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోనే పెట్టుబడిగా వినియోగిస్తామని చెప్పారు. 13వ ఎస్బీఐ బ్యాంకింగ్, ఎకనామిక్స్ కాన్క్లేవ్ 2026లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఎన్పీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది. రూ.75,000కు మించిన లావాదేవీలపై ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేశారు. రూ.2,000 దాటినప్పటికీ పర్సన్-టు-పర్సన్ (పీ2పీ) లావాదేవీలకు ఈ ఛార్జీ వర్తించదు.
96 శాతం లావాదేవీలకు ప్రభావం లేదు
జీరో ఎండీఆర్ పరిధిలోని చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపు ఉంటుందని దిలీప్ ఆస్బే తెలిపారు. కొత్త విధానం వల్ల సుమారు 96 శాతం పీ2ఎం లావాదేవీలు ప్రభావితం కాకుండా ఉంటాయని అంచనా వేశారు. రైల్వేలు, టెలికమ్యూనికేషన్స్, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ఉత్పాదకాలు వంటి కొన్ని రంగాల్లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ప్రతి లావాదేవీకి రూ.5 చొప్పున ఫ్లాట్ ఎండీఆర్ వర్తించనుంది. సుమారు రూ.1,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారాల నుంచే దాదాపు 80 శాతం ఎండీఆర్ వసూలవుతుందని ఆస్బే వెల్లడించారు. ఇప్పటివరకు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీలు చెల్లిస్తున్న వ్యాపారుల నుంచే అధిక మొత్తంలో ఎండీఆర్ వస్తుందని వివరించారు. వ్యాపారులు ఈ భారాన్ని వినియోగదారులపై మోపకుండా వ్యవస్థను రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
3 ఏళ్లలో రూ.3,000 కోట్ల నిధి
ఎండీఆర్ వసూళ్లలో 5 శాతాన్ని యువ పారిశ్రామికవేత్తలు, మద్దతు అవసరమైన రంగాల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక నిధికి మళ్లించాలని ప్రతిపాదించినట్లు ఆస్బే తెలిపారు. ఎన్పీసీఐ, ఆర్బీఐ, ఇతర భాగస్వాములతో కలిసి నిధి రూపకల్పనపై పనిచేస్తున్నామని చెప్పారు. 3 ఏళ్లలో ఈ నిధి సుమారు రూ.3,000 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది వ్యాపారుల వద్ద సౌండ్‌బాక్స్‌లు ఉండగా, మరో 4 కోట్ల మంది వ్యాపారులు కేవలం క్యూఆర్ కోడ్లను వినియోగిస్తున్నారని ఆస్బే వివరించారు. ఎండీఆర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సౌండ్‌బాక్స్‌లు, కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు వంటి డిజిటల్ చెల్లింపుల సాంకేతికతల్లో తిరిగి పెట్టుబడిగా వినియోగిస్తామని తెలిపారు. మూలధన మార్కెట్ లావాదేవీలపై 0.02 శాతం ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుందని వెల్లడించారు.

