చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సేవలు అభినందనీయం
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతారెడ్డి
భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు
కాకతీయ, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతారెడ్డి కొనియాడారు. హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జూనియర్ ఛాంపియన్‌షిప్ బాల, బాలికల పోటీలకు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను సోమవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించారు. అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీలతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సాఫ్ట్‌బాల్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా క్రీడాకారులకు శిక్షణ అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ సీఐ రంజిత్‌కుమార్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియలో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తాబేటి రాజేందర్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కోచ్ పోలేపాక వినయ్‌కుమార్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ, ఫిజికల్ డైరెక్టర్ సుమలత, కోచ్ బుస రాజు, ఫిజికల్ డైరెక్టర్లు ఏ. సృజన, కిరణ్మయి, రాజేశ్వర్, ప్రసన్న, మానస, రాజేశ్వరి, మౌనిక, పీడీలు ఆసిఫ్ ఇక్బాల్, రియాజ్, రాజు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం శ్రీలతారెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.

