గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం
బహిరంగ ప్రదేశంలో వదిలివేత
పంచాయతీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో దరఖాస్తుల నిర్వహణపై నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను భద్రపరచకుండా గ్రామసభ ప్రాంగణంలోని టేబుల్‌పై వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సిరిమిల్ల హరీష్ వీబీజీఆర్‌ఏఎంజీ పథకం కింద పశువుల కొట్టం, కొత్త జాబ్‌కార్డు కోసం రెండు దరఖాస్తులను గ్రామ కార్యదర్శి కవిత, సర్పంచ్ బండారుపల్లి వినయకుమారికి అందజేశారు. గ్రామసభ ముగిసిన అనంతరం తన దరఖాస్తులను అధికారులు భద్రపరచకుండా టేబుల్‌పై వదిలేశారని హరీష్ ఆరోపించారు. తిరిగి కార్యాలయానికి వెళ్లినప్పుడు దరఖాస్తులు బయటే పడి ఉండటాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు సమర్పించే దరఖాస్తులను బాధ్యతగా నిర్వహించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇలాంటి నిర్లక్ష్యంతో అర్హులైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తాను సమర్పించిన దరఖాస్తులను అధికారికంగా స్వీకరించి త్వరగా పరిష్కరించాలని హరీష్ కోరారు.

