పరాయి పాలన వచ్చింది!
ప్రశ్నార్థకంగా తెలంగాణ అస్తిత్వం
తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి
ఉద్యోగాలు మనవే.. మార్కులు వేసేది ఆంధ్రావాళ్లు
వరంగల్ నుంచే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ పోరాటం
మామునూరు ఎయిర్‌పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి
తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వయం పాలన పోయి.. పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదే అయినా పాలన మాత్రం ఆంధ్రా కనుసన్నల్లోనే సాగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్ అన్నారు. తెలంగాణ అస్తిత్వమే మళ్లీ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు తెలంగాణ యువతవే అయినా.. మార్కులు వేసేది ఆంధ్రావాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, వనరులను కాపాడుకునేందుకు వరంగల్ నుంచే మరో ఉద్యమ స్ఫూర్తితో పోరాటం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని మాస్టర్‌జీ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్, విశిష్ట అతిథిగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కారం రవీందర్‌రెడ్డి, అతిథిగా సమన్వయకర్త శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, నల్ల నరసింహులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా కళాకారుడు, ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, జీవిత సాఫల్య పురస్కార గ్రహీత వల్లంపట్ల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.

తెలంగాణ పాలనపై పెత్తనం ఎందుకు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలనలో పూర్తి స్వయం ప్రతిపత్తి కనిపించడం లేదని ప్రకాష్ అన్నారు. గతంలో పాలనాపరమైన నిర్ణయాలు సచివాలయంలోనే జరిగేవని, ఇప్పుడు ఢిల్లీ నుంచో.. అమరావతి నుంచో అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రంపై మరోసారి పరాయి ప్రభావం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదురైన పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణ వనరులు, నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. పాలమూరు ప్రాంతం నుంచి నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా.. పాలమూరు బిడ్డగా చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కృష్ణా జలాలు ఎటు పోతున్నాయి
జూరాల ప్రాజెక్టు నీటిని తెలంగాణ ప్రాంతానికి అందించాల్సిన పరిస్థితిలో పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు జిల్లాలోని కండలేరు, సోమశిల ప్రాజెక్టులకు, చిత్తూరు, అనంతపురం, ఒంగోలు ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు నీరు తరలిస్తున్నారని ప్రకాష్ ఆరోపించారు. కృష్ణా జలాలు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు అందకుండా కుప్పం వరకు ఎలా వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి వెళ్తున్న నీటితో విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో పంటలు పండుతుంటే.. తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ హయాంలోనూ సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు, ప్రజలకు అనేక సౌకర్యాలు అందాయని పేర్కొన్నారు. ఇంటింటికీ నీరు, రైతులు, పరిశ్రమలకు విద్యుత్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయని చెప్పారు. ప్రస్తుత పాలనలో పరిస్థితి తిరగబడిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంపై కూడా ప్రకాష్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. మేడిగడ్డను బాంబులతో పేల్చేశారని తాను గతంలో చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదని అన్నారు. 2024 జనవరిలో పెద్దపల్లి సమీపంలోని హుస్సేన్‌మియా వాగుపై చెక్‌డ్యాంలను పేల్చేస్తున్న కాంగ్రెస్ నాయకులను రైతులు పట్టుకున్నారని, దీనిపై ఇప్పటివరకు చర్యలు లేవని ఆరోపించారు. 2026లో మానేరు నదిపై 2 బ్యారేజీలు దెబ్బతిన్నాయని, సంబంధిత ఈఈ కూడా వాటిని పేల్చేశారని చెప్పినట్లు ప్రకాష్ పేర్కొన్నారు. అయితే అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో నిర్మించిన నాణ్యతా లోపాల కారణంగానే అవి దెబ్బతింటున్నాయని చెబుతున్నారని, వరదలు లేనప్పుడు బ్యారేజీలు ఎలా దెబ్బతింటాయని ప్రశ్నించారు. మేడిగడ్డ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం పుణెలోని సీడబ్ల్యూవోపీఆర్ఎస్ సంస్థకు అప్పగించిందని, ఆ సంస్థ పరిశీలనలో అన్ని బ్యారేజీలు, పిల్లర్లు బాగున్నాయని, 4 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయని తేలిందని ప్రకాష్ అన్నారు. ఆ 4 పిల్లర్లు ఎందుకు దెబ్బతిన్నాయన్న అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఎన్డీఎస్ఏ, ఎన్జీఆర్ఐ, విజిలెన్స్, ఇతర కమిటీలు పరిశీలించినా పిల్లర్లు ఎందుకు కుంగాయన్న కారణం తేలలేదని పేర్కొన్నారు. వరంగల్ నిట్, బాంబే ఐఐటీ ఇంజినీర్లు కూడా సర్వేలు చేసినా కారణాలు ఇప్పటికీ తేలలేదని అన్నారు. ఈ అంశంపై పూర్తి వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మామునూరు ఎయిర్‌పోర్టుకు జయశంకర్ పేరు
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని ప్రకాష్ డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తిగా నిలిచారని, ఆయన పేరును మామునూరు విమానాశ్రయానికి పెట్టడం సముచితమని అన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాడే వారికి అస్తిత్వ వేదిక గురువులా, మార్గదర్శిగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఓరుగల్లు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందన్నారు. రామప్ప ఆలయ పరిరక్షణకు అస్తిత్వ వేదిక ముందుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రశ్నార్థకంగా మారిందని ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా అన్ని రంగాల్లో సమాన అభివృద్ధి జరగలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆంధ్రా పాలకులు, నేతల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, అమరావతి నుంచి ఆదేశాలు వస్తే వారి విగ్రహాలను పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ గద్దర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి అక్కడి పాలకులు అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే విజయవాడలో గద్దర్, జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. పాలకులు తెలంగాణకు చెందినవారైనా.. వారిని నడిపించేది ఆంధ్రావాళ్లేనని ఆరోపించారు. తెలంగాణ వనరులను తెలంగాణ ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్ఫూర్తితో అస్తిత్వ వేదిక పనిచేస్తుందని, వరంగల్ నుంచే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ పోరాటం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ వనరులపై దోపిడీ ఆపాలి
తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్నాయని తెలంగాణ అస్తిత్వ వేదిక సమన్వయకర్త శ్రీధర్ దేశ్‌పాండే అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమకారుల ఆలోచనలతో రూపుదిద్దుకుందని, అయితే దాని రూపంతో పాటు తెలంగాణ గేయం వాణిని కూడా మార్చారని విమర్శించారు. తెలంగాణ రానివ్వనని ప్రమాణం చేసిన రోశయ్య విగ్రహాలను రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అన్నారు. రైతాంగానికి గోదావరి నీటిని అందించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని, కృష్ణా జలాలను సైతం ఆంధ్రాకు వదిలేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే తప్ప.. వనరుల దోపిడీ మాత్రం పెరిగిపోయిందని విమర్శించారు. మేడిగడ్డ గేట్లకు మరమ్మతులు చేయకుండా నీటిని వృథాగా వదులుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోంది
తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాధించుకోవడం ఒక్కటే తమ లక్ష్యం కాదని, అన్ని రంగాల్లో సమాన అభివృద్ధి జరగాలని ఉద్యమకారులు కోరుకున్నారని చెప్పారు. పాలకులు మారినా తెలంగాణ అస్తిత్వంపై దాడి కొనసాగుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఇప్పుడు మేమే ఇచ్చిన తెలంగాణ అని కొందరు చెప్పుకోవడం బాధాకరమన్నారు. వరంగల్‌లోని మాస్టర్‌జీ కళాశాలలు తెలంగాణ ఉద్యమానికి కేంద్రాలుగా నిలిచాయని గుర్తుచేశారు. తెలంగాణ పోరాట చరిత్రను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలకులు ప్రజా సమస్యల కంటే తమ ఆస్తులను కాపాడుకునే పనుల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వ వేదిక మరోసారి పోరాటానికి సిద్ధమవుతోందని, వరంగల్ నుంచే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కారం రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ అస్తిత్వ వేదిక ఆధ్వర్యంలో పోరాటం
తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భాష, నీళ్లు, వనరులు, ఉద్యోగాలు, హక్కుల పరిరక్షణ కోసం ప్రజలను సమీకరిస్తామని వక్తలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర వనరులపై ప్రజలకు పూర్తి హక్కు ఉండేలా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న, రాష్ట్ర గెజిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర సలహాదారు గంగాపురం వేణుమాధవ్, డాక్టర్ జేఏసీ నాయకుడు నాగేంద్రబాబు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్, గుల్లపల్లి చిరంజీవి, వద్దిరాజు గణేష్, తాడిశెట్టి క్రాంతి, కొక్కొండ విజయబాబు, రాచకొండ ప్రవీణ్, డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, డాక్టర్ పాలమాకుల కొమరయ్య, డాక్టర్ వోడితల రాము, రావుల రాజకుమార్, గుండేటి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

