వరంగల్ అస్తిత్వం దెబ్బతింది
జిల్లాను ముక్కలు చేసి ఆగం చేశారు
ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేసే కుట్ర జరిగింది
ఎంపీ టికెట్ చేజారడం వెనుక నలుగురు నేతలు
నా రాజకీయ గురువు ఇప్పటికీ.. ఎప్పటికీ కేసీఆరే
ఉద్యమకారుల బతుకులు మారలేదు
రూ.10 వేల కోట్లతో ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ళ రవికుమార్
తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్
తెలంగాణ ఉద్యమాల్లో గర్జించిన చారిత్రక ఓరుగల్లు గడ్డ స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ దారుణంగా వెనుకబడిపోయిందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ అన్నారు. ఒకప్పుడు వరంగల్ అంటేనే తెలంగాణలో ప్రత్యేకమైన బ్రాండ్ ఉండేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాధాన్యం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం మసకబారుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న ఆశలు నెరవేరలేదని, కొందరి స్వార్థపూరిత రియల్ ఎస్టేట్, ఆర్థిక ప్రయోజనాల కోసం జిల్లాను విచక్షణారహితంగా ముక్కలు చేశారని విమర్శించారు. జిల్లాను విభజించడం వల్ల వరంగల్ సమగ్ర రాజకీయ, సామాజిక అస్తిత్వం బలహీనపడిందని, ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు అధిష్ఠానం వద్ద మోకరిల్లడంలో, కాళ్లు మొక్కడంలో పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన పరిణామాలు, ఎంపీ టికెట్ చేజారిన తీరు, కేసీఆర్‌తో తన అనుబంధం, తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి, ఓదార్పు యాత్ర, ఆటోడ్రైవర్ల సమస్యలు, భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఓరుగల్లు గడ్డ అస్తిత్వమే దెబ్బతింది
తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్రను ఎవరూ విస్మరించలేరు. ఓరుగల్లు గడ్డ ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. తెలంగాణ కోసం జరిగిన ప్రతి కీలక పోరాటంలో ఈ ప్రాంతం తనదైన ముద్ర వేసింది. ప్రజలను కదిలించిన అనేక ఉద్యమాలకు వరంగల్ వేదికగా నిలిచింది. అలాంటి చారిత్రక ప్రాంతం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాల్సింది పోయి వెనుకబడిపోయింది. ఒకప్పుడు వరంగల్ అంటే ఒక పెద్ద బ్రాండ్. తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకు ఉన్న ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయింది. ఇది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో పెద్దగా కనిపించడం లేదు. వరంగల్‌కు రావాల్సిన ప్రాధాన్యం, పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన ఈ ప్రాంతానికి స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. వరంగల్ తన సహజమైన పోరాట పటిమను, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయేలా పాలకులు వ్యవహరించారు. అందుకే వరంగల్ ఆత్మను చంపేశారనే భావన కలుగుతోంది.

జిల్లాను ముక్కలు చేశారు
వరంగల్ జిల్లాను విభజించిన విధానం ఈ ప్రాంత అస్తిత్వంపై ప్రభావం చూపింది. పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, వరంగల్ అనే సమగ్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక అస్తిత్వం బలహీనపడింది. కొందరు స్వార్థపరుల రియల్ ఎస్టేట్, ఆర్థిక ప్రయోజనాల కోసం జిల్లాను విచక్షణారహితంగా ముక్కలు చేశారనే అభిప్రాయం ఉంది. దాని వల్ల సహజమైన రాజకీయ బలం తగ్గింది. ప్రజా సమస్యలపై సమష్టిగా ప్రశ్నించే శక్తి బలహీనపడింది. ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా వరంగల్ నుంచి బలమైన గొంతు వినిపించేది. ఇప్పుడు ఆ స్థాయిలో సమష్టి స్వరం వినిపించడం లేదు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేసే కుట్ర జరిగినట్టుగా పరిస్థితి తయారైంది. జిల్లాను ముక్కలు చేయడం వల్ల కేవలం భౌగోళిక మార్పు మాత్రమే జరగలేదు. రాజకీయంగా కూడా వరంగల్‌కు ఉన్న బలం దెబ్బతింది. తెలంగాణ ఉద్యమాల్లో గర్జించిన ఓరుగల్లు తన హక్కుల కోసం అదే స్థాయిలో ప్రశ్నించలేని పరిస్థితి రావడం ఆందోళనకరం.
ప్రజల గొంతుకగా నిలిచే నేతలెక్కడా?
వరంగల్ అభివృద్ధికి కావాల్సిన నిధులను రాబట్టడంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించాల్సిన నాయకులు ఆ పని చేయడం కంటే అధిష్ఠానం వద్ద మోకరిల్లడంలో, కాళ్లు మొక్కడంలో పోటీ పడుతున్నారు. ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించాల్సిన సమయంలో పదవులు, వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్తు కోసం రాజీపడే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వరంగల్ అభివృద్ధి వెనుకబడింది. ప్రజాప్రతినిధులు ప్రజల గొంతుకగా నిలవాలి. వరంగల్‌కు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, సంస్థలు, అవకాశాల కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ అలాంటి రాజకీయ పోరాటం కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పోషించిన పాత్రకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. ప్రజల సమస్యలపై ప్రశ్నించాలి. ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడాలి. కానీ అధిష్ఠానం వద్ద విధేయత ప్రదర్శించడానికే ప్రాధాన్యం ఇస్తే వరంగల్ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వరంగల్ తన ప్రత్యేకతను మరింత కోల్పోయే ప్రమాదం ఉంది.
ఎంపీ టికెట్ చేజారడం వెనుక నలుగురు నేతలు
నా రాజకీయ ప్రయాణంలో కుట్రలు కోకొల్లలుగా ఎదురయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో ఎన్నో పరిణామాలను చూశాను. ముఖ్యంగా వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో జరిగిన పరిణామాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకు ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారైన పరిస్థితి ఉంది. నా చట్ట పరిజ్ఞానం, వాగ్ధాటి, భాషా నైపుణ్యాలు ఢిల్లీ రాజకీయాల్లో ఉపయోగపడతాయని నాయకత్వం భావించింది. కానీ నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు నాయకులు వ్యతిరేకంగా వ్యవహరించారు. నాకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఆ పరిణామాల కారణంగానే టికెట్ దక్కలేదని నేను భావిస్తున్నాను. నా ఎంపీ టికెట్ చేజారడం వెనుక నలుగురు నేతలు ముఖ్యపాత్ర పోషించారు. కేసీఆర్‌ను కూడా కొందరు తప్పుదోవ పట్టించారు. అయితే చివరికి ఆయన కూడా విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన నాయకుడే కదా. అప్పట్లో జరిగిన అన్ని విషయాలను ఇప్పుడు బయటపెట్టడం లేదు. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. నా రాజకీయ జీవితంలో జరిగిన పరిణామాలపై ఒక పుస్తకం రాయాలనే ఆలోచన కూడా ఉంది. అందులో జరిగిన విషయాలను పూర్తి వివరాలతో ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడే అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో నిజాలు బయటకు వస్తాయి.
కేసీఆరే నా రాజకీయ గురువు
రాజకీయంగా నాకు ఇప్పటికీ.. ఎప్పటికీ కేసీఆరే గురువు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఉద్యమం అంటే ఏమిటి.. ప్రజలను ఎలా సమీకరించాలి.. ఒక లక్ష్యం కోసం ఎలా పోరాడాలి.. అనే విషయాల్లో తెలంగాణ ఉద్యమం నాకు ఎంతో నేర్పింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రత్యేకమైన రాజకీయ ప్రక్రియగా సాగింది. ఆ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది తమ జీవితాలను, సమయాన్ని, ఆర్థిక వనరులను పణంగా పెట్టారు. నేను కూడా ఆ ఉద్యమంలో భాగస్వామినే. రాజకీయ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కేసీఆర్‌ను నా రాజకీయ గురువుగా భావిస్తాను. రాజకీయంగా నా భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుంది అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం నా దృష్టి మాత్రం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వారికి న్యాయం జరిగేలా పోరాడటంపైనే ఉంది. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. కానీ ఒక ఉద్యమంలో కలిసి పనిచేసిన అనుబంధం మాత్రం మిగిలిపోతుంది. అందుకే ఇప్పటికీ కేసీఆర్‌ను నా రాజకీయ గురువుగా గౌరవిస్తాను.
ఉద్యమకారుల బతుకులు మారలేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదు. రాష్ట్ర సాధన కోసం తమ సమయాన్ని, డబ్బును, మేధస్సును, వయస్సును పెట్టుబడిగా పెట్టిన వారికి తగిన గుర్తింపు దక్కడం లేదు. ఈ రాష్ట్ర సాధనలో పెట్టుబడి పెట్టిన వారికి సరైన వాటా దక్కడం లేదు. ఉద్యమకారులను గుర్తించడం అంటే కేవలం సన్మానాలు చేయడం కాదు. వారి కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరిచే విధంగా శాశ్వత చర్యలు తీసుకోవాలి. ఉద్యమ సమయంలో తమ జీవితాలను పక్కన పెట్టి తెలంగాణ కోసం నిలిచిన వారికి స్వరాష్ట్రంలో తగిన గౌరవం, రాజకీయ ప్రాధాన్యం రావాలి. ఉద్యమానికి కరదీపికగా పనిచేసినవారు అధికారంలో భాగస్వామ్యం కావడానికి ఎందుకు పనికిరారని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు రావాలి. వారి కుటుంబాలు గౌరవప్రదంగా జీవించే పరిస్థితి కల్పించాలి. రాష్ట్రం కోసం పోరాడిన వారికి రాష్ట్రంలో సరైన వాటా దక్కాలన్నదే మా డిమాండ్.
రూ.10 వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఉద్యమకారుల కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్. కేవలం గుర్తింపు పత్రాలు ఇవ్వడం, అప్పుడప్పుడు సన్మానాలు చేయడం వల్ల ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం కావు. వారికి శాశ్వత ఆర్థిక భరోసా కల్పించాలి. పెన్షన్లతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలి. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం ఇవ్వాలి. ఉద్యమకారుల బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. వారి పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సదుపాయాలు అందించాలి. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులకు గౌరవప్రదమైన జీవితం కల్పించాలి. రూ.10 వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఉద్యమకారుల సంక్షేమానికి శాశ్వత కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలి. ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం.
126 కుటుంబాలను కలిసిన ఓదార్పు యాత్ర
ప్రస్తుతం నేను తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాను. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఓదార్పు యాత్రకు మంచి స్పందన వస్తోంది. సెప్టెంబర్ 17న వరంగల్‌లోని తొలిదశ ఉద్యమ అమరవీరుల స్తూపం వద్ద యాత్ర ప్రారంభించాం. నాలుగు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాం. 126 మంది ఉద్యమకారుల కుటుంబాలను కలిశాం. వారి కుటుంబాల్లో ఆశించిన సంతోషం కనిపించలేదు. ఉద్యమంలో నిజంగా పాల్గొన్న వారిని గుర్తించడం, వారి కుటుంబాలను కలవడం, వారి సమస్యలను తెలుసుకోవడం, వారి బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మా లక్ష్యం. ఉద్యమ సమయంలో ఎవరు ఏ స్థాయిలో పనిచేశారు.. ఎలాంటి పరిస్థితుల్లో పోరాడారు.. వారి కుటుంబాలు ఎలాంటి త్యాగాలు చేశాయి.. అనే విషయాలను తెలుసుకుంటున్నాం. పదేళ్లు దాటినా ఉద్యమకారుల బతుకులు ఎందుకు మారలేదు అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఓదార్పు యాత్ర ద్వారా వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్లను ఉంచుతున్నాం.
ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక యూనియన్ ఏర్పాటు
ఆటోడ్రైవర్లపై జరుగుతున్న వివక్ష, వారు ఎదుర్కొంటున్న బాధలను చూడలేక తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్‌ను స్థాపించాను. రాష్ట్రంలో ఈ రంగంపై లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ రంగంలో పనిచేస్తున్న వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలిసి.. తెలియక చేసిన తప్పులకు కూడా వేధింపులకు గురవుతున్నారు. రోడ్లపై పనిచేసే ఆటోడ్రైవర్ల పరిస్థితి, వారి కుటుంబాల జీవన స్థితి, రోజువారీ ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆటో రంగాన్ని కేవలం రవాణా వ్యవస్థలో ఒక భాగంగా చూడకుండా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న రంగంగా గుర్తించాలి. ఆటోడ్రైవర్ల సమస్యలపై ప్రత్యేక విధానాలు రూపొందించాలి. వారికి రక్షణ, సంక్షేమం, న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్‌ను ఏర్పాటు చేశాను.
న్యాయవాదిగా.. సామాజిక ఉద్యమకారుడిగా
1995లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాను. కోర్టులో కుల, వర్గ వివక్షను ఎదుర్కొన్నాను. చట్టాలపై పట్టు, ఆంగ్లం, హిందీ భాషల పరిజ్ఞానంతో న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నాను. క్రాస్ ఎగ్జామినేషన్‌లో బలమైన వాదనలతో కేసులు వాదించాను. పేదలు, ఉద్యమకారుల కేసులను అనేక సందర్భాల్లో ఉచితంగా వాదించాను. 1998లో యువ న్యాయవాదుల సంఘాన్ని ఏర్పాటు చేసి న్యాయవాదుల వృత్తి నైపుణ్యాల పెంపునకు కార్యక్రమాలు నిర్వహించాను. చిన్నతనంలోనే వివిధ సామాజిక వర్గాల మధ్య పెరిగిన అనుభవం నా ఆలోచనా విధానంపై ప్రభావం చూపింది. వరంగల్‌లో పుట్టి రంగంపేటలో పెరిగాను. నా తల్లి గుడిమళ్ళ పుష్పలీల ఎంజీఎంలో నర్సుగా పనిచేశారు. తండ్రి రాఘవేందర్‌రావు ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. వారిద్దరిదీ కులాంతర ప్రేమవివాహం. దళిత, బడుగు, బలహీన వర్గాల సమస్యలను దగ్గరగా చూసే అవకాశం చిన్నతనం నుంచే వచ్చింది. అందుకే సామాజిక సమస్యలపై స్పందించే స్వభావం ఏర్పడింది.
మ్యాజిక్ నుంచి ఉద్యమాల వరకు
1982లో మిత్రులతో కలిసి మూన్‌లైట్ యూత్‌ను ఏర్పాటు చేశాం. వ్యాయామశాల నిర్వహించాం. నవచైతన్య అసోసియేషన్ ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాం. మహిళా విద్యార్థినులకు రక్షణగా నిలిచాం. వరదల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్నాం. మెజీషియన్ ఉమాపతి వద్ద మ్యాజిక్ నేర్చుకుని వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. మ్యాజిక్ షోల వల్ల నాలోని బిడియం, భయం తొలగిపోయాయి. ప్రజల ముందు మాట్లాడే ధైర్యం పెరిగింది. మైకు పట్టుకుని మాట్లాడే వాగ్ధాటి, నాయకత్వ లక్షణాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. మండల్ కమిషన్ పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఆ ఉద్యమ అనుభవాలు నా ప్రజా ఉద్యమ ప్రస్థానానికి ఉపయోగపడ్డాయి. 1980 నుంచి 2000 మధ్య ఉమ్మడి వరంగల్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎన్‌కౌంటర్లు, మందుపాతరలు, అమాయకుల మరణాలు నన్ను కలచివేశాయి. తెలంగాణ వెనుకబాటుతనం, అసమానతలపై ఆలోచన మొదలైంది. ప్రత్యేక తెలంగాణ సాధనే శాంతియుత ప్రజా తెలంగాణకు మార్గమని నమ్మి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై లోతుగా అధ్యయనం చేశాను.
ఉద్యమ ప్రముఖులతో కలిసి.. భవిష్యత్ పోరాటం
తెలంగాణ ప్రజా సమితి సదస్సులకు హాజరయ్యాను. ప్రొఫెసర్ జయశంకర్‌తో వేదిక పంచుకున్నాను. ప్రజాకవి కాళోజీ నారాయణరావు, భూపతి కృష్ణమూర్తి, ఆచార్య బి. జనార్ధన్‌రావు, ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తదితరులతో కలిసి ఉద్యమ వేదికల్లో పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం నా రాజకీయ, సామాజిక ఆలోచనలకు పునాది వేసింది. నా రాజకీయ భవిష్యత్ ఏంటన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం రాజకీయ పదవులు, భవిష్యత్ లెక్కల కంటే ఉద్యమకారులను గుర్తించే పనిపైనే నా దృష్టి ఉంది. ఉద్యమకారుల కుటుంబాలను కలుస్తున్నాను. వారి సమస్యలను తెలుసుకుంటున్నాను. ఓదార్పు యాత్ర ద్వారా వారి పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాను. వరంగల్ తన సహజమైన పోరాట పటిమను తిరిగి పొందాలి. ప్రజల కోసం ప్రశ్నించే తత్వాన్ని కొనసాగిస్తాను. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోను. తెలంగాణ కోసం జీవితాలను పెట్టుబడిగా పెట్టిన ఉద్యమకారులకు స్వరాష్ట్రంలో న్యాయం జరగాలన్నదే మా ప్రధాన లక్ష్యం. వారి హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తాను.
ఉత్తరం కాకతీయ ఎడిటర్
అరెల్లి కిరణ్ గౌడ్
-7396604266

