భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం
కడవేరుగులో విషాద ఘటన.. పెద్ద కుమారుడి వద్దే ఉంటున్న వృద్ధుడు
కాకతీయ, చేర్యాల: భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన పబ్బోజు కిష్టయ్య (68) కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారందరికీ వివాహాలు కావడంతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో అప్పటి నుంచి కిష్టయ్య ఆమెను తలుచుకుంటూ బాధపడేవాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఆయన తన పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో కడవేరుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


